Share News

సర్కారు భూమికి స్కెచ్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:54 AM

పెందుర్తి మండలం చింతగట్లలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి కూటమి నేతల ప్రోత్సాహంతో ఒకరు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

సర్కారు భూమికి స్కెచ్‌

  • చింతగట్ల సర్వే నంబరు 81.2లో 47.714 ఎకరాలు కొండ పోరంబోకు భూమి

  • అందులో 40 ఎకరాలు పేదల ఇళ్ల కోసం సమీకరణ

  • మిగిలిన 7 ఎకరాల్లో 5 ఎకరాలు కొట్టేసేందుకు ప్లాన్‌

  • డి.పట్టా పేరిట నాటకం

  • తెర వెనుక కూటమి నేత బంధువు

  • రెవెన్యూ అధికారులపై ఒత్తిడి

విశాఖపట్నం/పెందుర్తి, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి మండలం చింతగట్లలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి కూటమి నేతల ప్రోత్సాహంతో ఒకరు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్న విషయం రెవెన్యూ అధికారులు చెప్పినా వినకుండా బెదిరించి సర్వే చేయించారు. దాని ఆధారంగా కోర్టును ఆశ్రయించి భూమిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.

చింతగట్ల గ్రామ సర్వే నంబరు 81.2లో 47.714 ఎకరాలు కొండ పోరంబోకు ఉంది. ఇటీవల భూముల రీసర్వే నిర్వహించినప్పుడు కూడా సర్వేనంబరు 81-2లో గల 47.714 ఎకరాలను ప్రభుత్వ భూమిగానే నిర్ధారించారు. అందులో 40 ఎకరాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల కోసం సమీకరించారు. ప్రస్తుతం 7.714 ఎకరాలు మిగిలి ఉంది. దానిపై కొందరు కూటమి నేతల కన్నుపడింది. ఎలాగైనా భూమి కొట్టేయడానికి ప్లాన్‌ వేశారు. ఇదిలావుండగా తనకు 1970 ప్రాంతంలో ప్రభుత్వం కొండవాలులో భూమి ఇచ్చిందంటూ (డీపట్టా) ఒకరు కొద్దికాలం కిందట రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. సదరు దరఖాస్తుదారుడితో కూటమి నేతలు ఒప్పందం చేసుకుని సర్వే నంబరు 81-2లోనే తన ఐదు ఎకరాలు ఉందని, సర్వే చేసి తన భూమి తనకు అప్పగించాలని మరోమారు దరఖాస్తు చేయించారు. దీని ఆధారంగా సచివాలయ సర్వేయర్‌ కొండ వాలు ప్రాంతంలో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారు. అందులో ఎటువంటి యాజమాన్య వివరాలను నిర్ధారించలేదు. అదంతా ప్రభుత్వ భూమిగానే పేర్కొన్నారు. అయినప్పటికీ 81-2లో ఐదు ఎకరాలను తన పేరిట నమోదు చేయాలని సదరు దరఖాస్తుదారుడు చింతగట్ల వీఆర్వోను కోరగా, అందుకు ఆయన తిరస్కరించారు. సర్వే నంబరు 81-2లో గల 7.714 ఎకరాలు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. దీంతో వెనుక ఉండి కథ నడిపిస్తున్న కూటమి నేతలు...సదరు దరఖాస్తుదారుడితో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. కూటమి పార్టీలో కీలక నేత బంధువునని చెప్పుకుంటున్న ఒకరు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. సర్వేనంబరు 81-2లో భూమి ప్రభుత్వానికి చెందినదేనని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2024 జనవరిలో వైసీపీ నాయకులు దగ్గరుండి గ్రామానికి చెందిన కొందరికి ఇళ్ల స్థలాల కోసం కొండవాలు చూపించారు. దీంతో భూమిలోకి వెళ్లి చదునుచేస్తుండగా రెవెన్యూ సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి ఆక్రమణలకు పాల్పడకూడదని స్పష్టంచేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఐదు ఎకరాలను ఒకరికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కలెక్టర్‌ జోక్యం చేసుకుని అక్రమార్కుల కుట్రలను తిప్పికొట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

డిపట్టాలు రద్దు

రైవాడ కాలువ, పేద వర్గాలకు ఇళ్ల కోసం సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం గ్రామంలో సుమారు 20 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ అవసరాలకు డీపట్టా భూములు వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. రైవాడ కాలువ, ఇళ్ల కోసం అప్పట్లో కొన్ని డీపట్టా భూములు వెనక్కి తీసుకుని సదరు పట్టాలు రద్దు చేసింది.

Updated Date - Jul 13 , 2025 | 12:54 AM