లంబసింగి, తాజంగిలో పర్యాటకాభివృద్ధికి స్థల పరిశీలన
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:53 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ ఎ. ఆనందరావు, రెవెన్యూ, పర్యాటక శాఖ ఉద్యోగులు లంబసింగి, తాజంగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
ట్రైబల్ రైట్స్ మెమోరియల్ పార్కుగా
రూథర్‌ఫర్డు అతిథి గృహం
చెరువులవేనంలో సందర్శకులకు
అదనపు సదుపాయాలు
చింతపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ ఎ. ఆనందరావు, రెవెన్యూ, పర్యాటక శాఖ ఉద్యోగులు లంబసింగి, తాజంగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందిన లంబసింగిలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో పర్యాటక శాఖ ద్వారా లంబసింగిలో శిథిలమైన రూథర్‌ఫర్డ్ అతిథిగృహాన్ని ట్రైబర్ రైట్స్ మెమోరియల్ పార్కుగానూ, చెరువులవేనంలో అద్దాల బ్రిడ్జి, వ్యూడెక్, రోప్‌వే, మరుగుదొడ్లు, వాష్ రూమ్స్, టిక్కెట్ కౌంటర్, పర్యాటకులు కూర్చోవడానికి కూర్చీలు, పార్కింగ్ స్థలాలు, తాజంగి రిజర్వాయర్‌లో పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, వాష్‌రూమ్స్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూథర్‌ఫర్డ్ అతిథి గృహం వద్ద 2.67 ఎకరాలు, చెరువులవేనం కొండపై మూడు ఎకరాలు, ముఖద్వారం వద్ద ఎకరం, తాజంగి జలాశయం వద్ద రెండు ఎకరాల స్థలం కావాలని పర్యాటక శాఖ రెవెన్యూ శాఖను కోరింది. ఈమేరకు పర్యాటక శాఖకు స్థలం కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఆనందరావు విలేకరులతో మాట్లాడుతూ చెరువులవేనం కొండ, ముఖద్వారం వద్ద రెవెన్యూ స్థలం లేదని, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములు ఉన్నాయన్నారు. రూథర్‌ఫర్డ్ అతిథి గృహంలో భూమి కొంతమంది ఆదివాసీల ఆక్రమణలో ఉందన్నారు. తాజంగి జలాశయంలోనూ రెవెన్యూ స్థలం లేదన్నారు. ప్రత్యామ్నాయంగా పర్యాటక అభివృద్ధికి స్థలం కేటాయించేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లంబసింగి పర్యాటక మేనేజర్ అప్పలనాయుడు, ఆర్‌ఐ కృష్ణమూర్తి, వీఆర్వో వి. సదానందరావు పాల్గొన్నారు.