త్రిశంకుస్వర్గంలో సీతపాలెం!
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:54 AM
ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్) కోసం జీవనాధారమైన పంట భూములను ఇచ్చేశారు. చివరకు ఉన్న ఊరును కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు.
ఎస్‌ఈజడ్ కోసం భూములు ఇచ్చిన రైతులు
రెండు దశాబ్దాలు అయినా పునరావాసం కల్పించని ప్రభుత్వం
గ్రామాన్ని తరలించకుండా పరిశ్రమల ఏర్పాటు
ఫార్మా కంపెనీల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
రావిపాలెంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్న అధికారులు
దిబ్బపాలెం లేదా పంచదార్లలో కావాలంటున్న నిర్వాసితులు
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్
రాంబిల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్) కోసం జీవనాధారమైన పంట భూములను ఇచ్చేశారు. చివరకు ఉన్న ఊరును కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇది జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నది. కానీ నాడు అధికారులు, పాలకులు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. గ్రామానికి సమీపంలో ఏర్పాటైన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద తమకు అనువైనచోట పునరావాస కాలనీ నిర్మించాలని కోరుతున్నా. అధికారులు పట్టించుకోవడంలేదు.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రత్యేక ఆర్థిక మండలి కోసం పలు గ్రామాల మాదిరిగానే రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెంలో కూడా ఏపీఐఐసీ అధికారులు 230 ఎకరాలు సేకరించారు. అప్పట్లో నష్టపరిహారం కింద ఎకరాకు రూ.5.5 లక్షలు ఇచ్చారు. త్వరలో గ్రామాన్ని కూడా ఖాళీ చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎస్‌ఈజడ్ కోసం ముందుగా గ్రామాలను ఖాళీ చేయాల్సిన వారికి దిబ్బపాలెం వద్ద పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. సీతపాలెం నిర్వాసితులకు కూడా దిబ్బపాలెం లేదంటే పంచదార్లలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు చేసి, ఇళ్ల స్థలాలు ఇస్తామని, అందరికీ ఒకేచోట పునరావాసం కల్పిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. కానీ కొంతకాలం తరువాత దిబ్బపాలెం/పంచదార్ల కాకుండా అచ్యుతాపురం మండలంలోని రావిపాలెంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అయితే రావిపాలెంలో అధికారులు ప్రతిపాదించిన ప్రదేశం నివాస యోగ్యంకాదని, తమకు దిబ్బపాలెం ఎస్‌ఈజడ్ కాలనీలో, లేదంటే పంచదార్లలో ఇవ్వాలని సీతపాలెం నిర్వాసితులు కోరారు. కానీ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. మరోవైపు ఎస్‌ఈజడ్ కోసం సేకరించిన భూముల్లో కాలక్రమేణా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో సీతపాలెం గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. నిర్వాసిత గ్రామం కావడంతో అధికారులు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయడంలేదు. రహదారులు అధ్వానంగా వున్నాయి. తాము కోరినచోట ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు చేసి స్థలాలు ఇవ్వాలని, లేదంటే గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని సీతపాలెం నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. దిబ్బపాలెం లేదా పంచదార్లలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని, అందరికీ ఒకేచోట ఇళ్లు నిర్మించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షల చొప్పున సాయం అందించాలని, ఎస్‌ఈజడ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అంతవరకు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.
గ్రామాన్ని తరలించకుండా పరిశ్రమల ఏర్పాటు సరికాదు
లాలం గణేశ్, ఆర్.నారాయణమ్మ, సీతపాలెం!
ప్రత్యేక ఆర్థిక మండలి కోసం సుమారు రెండు దశాబ్దాల క్రితం మా భూములను తీసుకున్నారు. ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. గ్రామాన్ని తరలించకుండా.. మా భూముల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మూడు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గ్రామంలో ఉండలేకపోతున్నాం. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామాన్ని తరలించకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడం సరికాదు. అధికారులు గతంలో ఇచ్చిన హామీ మేరకు మేము కోరుకున్న చోట పునరావాల కాలనీ ఏర్పాటు చేయాలి.