Share News

ట్రాఫిక్‌లో పాతుకుపోయిన ఎస్‌ఐలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:26 AM

నగర ట్రాఫిక్‌ విభాగంలో కొందరు ఎస్‌ఐలు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. రెండు,మూడేళ్లకు ఒకసారి బదిలీ కావాల్సి ఉన్నా...కొందరు నాలుగేళ్లు దాటినా కదలలేదు. ఈ క్రమంలో కొందరికి స్టేషన్‌ పరిధిలో వ్యాపారులతో మంచి పరిచయాలు ఏర్పడడం, సిబ్బందితో బాగా అనుబంధం ఏర్పడడం వంటి కారణాలతో సమర్థంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలాకాలంగా ఒకే స్టేషన్‌లో ఎస్‌ఐలు పనిచేస్తుండడంతో విధి నిర్వహణలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ట్రాఫిక్‌లో   పాతుకుపోయిన ఎస్‌ఐలు

నాలుగేళ్లు దాటినా కదలని వైనం

విధి నిర్వహణలో ఇష్టారాజ్యం

బదిలీ కాకుండా కొందరి పైరవీ

మరికొందరు బదిలీ కోరుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర ట్రాఫిక్‌ విభాగంలో కొందరు ఎస్‌ఐలు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. రెండు,మూడేళ్లకు ఒకసారి బదిలీ కావాల్సి ఉన్నా...కొందరు నాలుగేళ్లు దాటినా కదలలేదు. ఈ క్రమంలో కొందరికి స్టేషన్‌ పరిధిలో వ్యాపారులతో మంచి పరిచయాలు ఏర్పడడం, సిబ్బందితో బాగా అనుబంధం ఏర్పడడం వంటి కారణాలతో సమర్థంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలాకాలంగా ఒకే స్టేషన్‌లో ఎస్‌ఐలు పనిచేస్తుండడంతో విధి నిర్వహణలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

నగరంలో వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, తనిఖీలు, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 21 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ఏడు నోటిఫైడ్‌ స్టేషన్‌లు కాగా, మిగిలినవి అవసరాన్ని బట్టి తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్నవే. ఒక్కో స్టేషన్‌కు ఒక ఎస్‌ఐ ఉండగా, వారిపై పర్యవేక్షణ కోసం సబ్‌ డివిజన్‌కు ఒకరు చొప్పున సీఐలు ఉంటారు. 21 పోలీస్‌ స్టేషన్లలో ప్రస్తుతం మూడు, నాలుగు స్టేషన్లలో ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన ఎస్‌ఐల్లో కొందరు నాలుగేళ్లకు పైబడి ఐదేళ్ల సర్వీస్‌ ఒకే స్టేషన్‌లో పూర్తిచేసుకున్నా బదిలీ జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు అదే పోస్టులో ఉండిపోయేందుకు పైరవీలు చేసుకుంటుండగా, మరికొందరు అక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. భీమిలి, ఎంవీపీ, టూటౌన్‌, ఫోర్త్‌ టౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐలతోపాటు మరికొందరు నాలుగేళ్లకు పైబడి సర్వీస్‌ పూర్తిచేసుకున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట ఉండిపోవడంతో సిబ్బందిలో కొందరితో సత్సంబంధాలు, మరికొందరికి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే సిబ్బంది పట్ల ఉదాసీనంగా ఉంటూ వారికి కోరినచోట డ్యూటీలు కేటాయిస్తూ, గిట్టని వారికి తరచూ కష్టమైనచోట డ్యూటీలు వేయడం, బందోబస్తులకు పంపించడం ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడంతో కొందరు ఎస్‌ఐలు ఆ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు, భవన నిర్మాణ సామగ్రి రవాణా చేసే వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నగరంలోకి అనుమతించడం, రోడ్డుపైనే లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అవకాశం కల్పించడం చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిలో ఒకరిద్దరు తమను వేరొకచోటకు బదిలీ చేయాలని తమ పైఅధికారులకు విజ్ఞప్తి చేసినా ఉన్నతాధికారుల జోక్యం లేకుండా బదిలీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారని ఎస్‌ఐలు వాపోతున్నారు. ఎస్‌ఐలు లాంగ్‌ స్టాండింగ్‌ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించాలనే డిమాండ్‌ డిపార్టుమెంట్‌ నుంచే వినిపిస్తోంది.

Updated Date - Aug 12 , 2025 | 01:26 AM