సింహాచలేశుడికి వైకుంఠ శోభ
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:55 PM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి మంగళవారం ఉత్తరద్వారంలో వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చారు.
ఉత్తర ద్వారంలో కొలువుదీరిన అప్పన్న
వేలాదిగా తరలివచ్చి దర్శించి, తరించిన భక్తులు
విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు
సింహాచలం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి మంగళవారం ఉత్తరద్వారంలో వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చారు. అధికారులు ముందుగా ప్రకటించిన మేరకు సోమవారం రాత్రి ఒంటిగంటకే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ధూపసేవ, సేవాకాలం, నిత్యహోమం వంటి ప్రభాత ఆరాధనలు పూర్తిచేశారు. ఆలయ అలంకారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శంఖు, చక్ర, గదాయుధాలు, కటి హస్తాలు, సకల ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలికలతో కాలుపై కాలు వేసుకుని కూర్చున్న రాజ భంగిమలో అలంకరించిన తీరు కట్టిపడేసింది. అనంతరం బంగారు తొళ్ళక్కియాన్‌లో ఉత్సవమూర్తిని ఏడు మేలి ముసుగుల మధ్య ఉంచి, ఉభయ దేవేరులతో అధిష్ఠింపజేశారు. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, సంకీర్తనలు, నాదస్వరాలపనలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ బేడామండప తిరువీధి నిర్వహించారు. ఆ మార్గంలో పూజలు చేసి, ఒక్కో ముసుగును తొలగించారు. ఆలయ ఉత్తర ద్వారంలో ఆఖరి ముసుగును తొలగించి వైకుంఠవాసుడిగా అప్పన్న దర్శనాన్ని కల్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యురాలు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, ఈవో సుజాత తొలిదర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని ఉత్తర రాజగోపురంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సుమారు 30 వేల మంది తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. ఉత్సవానంతరం మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. భక్తులకు పులుసు, పొంగలి ప్రసాదాలను పంపిణీచేశారు. స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్, ఈఈలు సీహెచ్ వెంకటరమణ, బండారు రాంబాబు, డీఈఈ డీవీఎస్ రామరాజు, ఎస్.సన్యాసిరావు, ఏఈఓలు కె.తిరుమలేశ్వరరావు, వీబీ రమణమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీసీపీ ప్రశాంతి, ఏసీపీ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు భద్రతా సేవలందించారు.