Share News

సింహాచలం సిరి గల్లంతు!

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:57 AM

సింహాచలం దేవస్థానంలోని ఆభరణాలకు ఆపద వచ్చింది.

సింహాచలం సిరి గల్లంతు!

  • భక్తులు ఇచ్చిన 111.38 గ్రాముల బంగారు ముత్యాలహారంలో మిగిలింది 36 గ్రాములే

  • అప్పన్న మ్యూజియంలోనూ అపచారం

  • 10 బంగారు గొలుసు ముక్కలు మాయం

  • బరువు 6.2 గ్రాములు

  • లెక్కాపత్రం లేని నిర్వహణ...నిర్లక్ష్యం

  • ఉప ఆలయాల్లో ఆభరణాలకు ఆపద

  • వెండి వస్తువులను పూజకు వాడతారు

  • కానీ, వాటిని ఎక్కడా నమోదు చేయరు

  • ఇలాంటివి 16 వెండి వస్తువులున్నట్టు గుర్తింపు

  • వాటి బరువు 9.464 కిలోలు

  • నివేదిక ఇచ్చి ఆరు నెలలైనా చర్యలు పూజ్యం..

  • మళ్లీ మరో ఐదుగురితో కమిటీ నియామకం

  • నాలుగు నెలలైనా విచారణ పేరుతో నాన్పుడు ధోరణి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానంలోని ఆభరణాలకు ఆపద వచ్చింది. లెక్కాపత్రం లేని దేవస్థానం నిర్వహణ, నిర్లక్ష్యంపై ఆరు నెలల క్రితమే నివేదిక అమరావతికి చేరినా, ఇంతవరకూ చర్యలు లేవు. దేవస్థానంలోని ఉప ఆలయాల్లో కొన్ని ఆభరణాలు లేవని తెలిసిందని, విచారణ జరిపించాలంటూ కడపకు చెందిన కొండోజు ప్రభాకార ఆచారి అనే భక్తుడు దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆయన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కాకినాడ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ కె.సుబ్బారావు (ఈయన చందనోత్సవం సమయంలో ఇన్‌చార్జి ఈఓ)ను విజయవాడ అధికారులు ఆదేశించారు. ఆయన అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదా కలిగిన పల్లంరాజును జ్యువెలరీ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ (జేవీఓ)గా సింహాచలం పంపించారు. ఆయన అనేకసార్లు ఆలయ అధికారులు, పూజార్లతో మంతనాలు జరిపి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సింహాచలం వచ్చి ఆభరణాలు తనిఖీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అమరావతిలో నివేదిక సమర్పించారు. అందులో అనేక లోపాలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొన్ని బంగారు ఆభరణాలు బరువు తగ్గినట్టు పేర్కొన్నారని, దేవస్థానానికి చెందిన ఉప ఆలయాల్లో 16 వెండి వస్తువులు గుర్తించామని, వాటి వివరాలు ఎక్కడా నమోదు చేయలేదని నివేదించినట్టు సమాచారం. కొండదిగువన పూదోటలోని వేంకటేశ్వరస్వామికి 111.38 గ్రాముల బంగారు ముత్యాల హారం ఉండాలని రిజిస్టర్‌లో నమోదుచేసి ఉండగా, ఆలయంలో 36 గ్రాముల బంగారు గొలుసు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అప్పన్న ఆలయ ప్రాంగణంలోని ఆభరణాల మ్యూజియంలో సుమారు 6.2 గ్రాముల బరువు గల 10 బంగారు గొలుసు ముక్కల ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.

ఆ వెండి వస్తువులకు లెక్కల్లేవు

సింహాచలం దేవస్థానానికి 12 ఉప ఆలయాలు ఉన్నాయి. వాటికి భక్తులు దఫదఫాలుగా వివిధ రూపాల్లో 9.464 కిలోల వెండి వస్తువులు బహుమతిగా ఇచ్చారు. వాటిని అక్కడి పూజార్లు అధికారులకు అప్పగించి, రికార్డుల్లో నమోదు చేయించాల్సి ఉంది. కానీ మొత్తం 16 వెండి వస్తువులను లెక్కలు చూపించకుండా ఉంచారు. ఆయా ఆలయాల్లో వాటిని పూజాది కార్యక్రమాలకు వాడుతున్నప్పటికీ, వీటికి సంబంధించిన వివరాలు దేవస్థానానికి చెందిన రిజిస్టర్‌లో నమోదు చేయలేదనే విషయం జేవీవో గుర్తించి నివేదికలో పొందుపరిచారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించినప్పుడు రశీదులు ఇవ్వాలి. ఆ వివరాలు రిజిస్టర్‌లో నమోదుచేయాలి. కానీ దేవస్థానం అధికారులు గానీ, ఆలయ పర్యవేక్షకులు గానీ ఈ విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడవుతున్నదని జేవీవో వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి కారకులైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చర్యలు చేపట్టకుండా కమిటీ నియామకం

జేవీఓ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు చేపట్టాల్సిన కమిషనర్‌ కార్యాలయం ఎందుకనో పునరాలోచన చేసింది. ఈ వ్యవహారంపై ఐదుగురు అధికారులతో ఒక కమిటీని ఏప్రిల్‌లో నియమించింది. చందనోత్సవం ముగిసిన వెంటనే ఆలయంలో ఆభరణాల లెక్కలన్నీ తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందులో మళ్లీ జేవీఓ పల్లంరాజును కూడా ఒక సభ్యుడిగా నియమించింది. వీరంతా గత నెల సింహాచలం వచ్చి కొన్ని ఆభరణాలను పరిశీలించి లెక్కించారు. ఇంకా మరికొన్ని లెక్కలు చూడాల్సి ఉంది. అయితే వైదిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున కమిటీ వచ్చినప్పుడు ఉప ఆలయాల పూజార్లు హాజరుకాలేకపోతున్నారు. దాంతో లెక్కలు ఇంకా తేలలేదు. తొలి విచారణ జరిగి ఆరు నెలలు, కమిటీ విచారణకు ఆదేశం ఇచ్చి నాలుగు నెలలైనా ఇంకా ఏ విషయం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిని కమిషనర్‌ కార్యాలయం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పాలనాపరమైన తప్పులు జరుగుతున్నప్పుడు తక్షణ చర్యలు చేపట్టకుండా ఇలా జాప్యం చేయడం మంచిది కాదని దేవదాయ శాఖ వర్గాలే చెబుతున్నాయి.

రిజిస్టర్‌లో నమోదు చేయని వెండి వస్తువులివీ..

- వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 248 గ్రాముల వెండి పళ్లెం

- గ్రామదేవత పైడితల్లమ్మ ఆలయంలో 329 గ్రాముల అరిటాకు పళ్లెం

- బంగారమ్మ ఆలయంలో 16 గ్రాముల బరువున్న రెండు సూత్రాలు

- భైరవస్వామి ఆలయంలో 208 గ్రాముల అర్ధ కిరీటాలు రెండు, 1.15 కిలోల బరువుగల రాళ్ల కవచం

- మాధవధార వేణుగోపాలస్వామి ఆలయంలో 89 గ్రాముల పంచపాత్ర, ఉద్దరిణి

- మాధవధార మల్లికార్జుస్వామి సన్నిధిలో 552 గ్రాముల అష్టలక్ష్మీ బిందె, 640 గ్రాముల బకెట్‌, చెంబు, చెంచా, 790 గ్రాముల ధార పాత్ర, 2,820 గ్రాముల పానుమట్టం, 218 గ్రాముల నాగాభరణం

- సింహగిరిపై కాశీవిశ్వేశ్వర పంచాయతన ఆలయంలో 835 గ్రాముల ధార పాత్ర, 260 గ్రాముల శఠారి, 955 గ్రాముల పళ్లెం

- గంగధార సమీపాన ఉన్న సీతారామస్వామి దేవాలయంలో 78 గ్రాముల కిరీటం, తదితర వస్తువులు...

Updated Date - Sep 10 , 2025 | 12:57 AM