సింహాచలం జనసంద్రం
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:28 AM
సింహ‘గిరి ప్రదక్షిణ’కు ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు విచ్చేశారు. భూ ప్రదక్షిణతో సమానమని, కొండ చుట్టూ 32 కి.మీ. కాలినడకన తిరిగితే పుణ్యఫలం లభిస్తుందని విస్తృతంగా ప్రచారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల నుంచి మహిళలు పిల్లలను తోడుగా తెచ్చుకొని ప్రదక్షిణ చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గురువారం ఉదయం 10 గంటల వరకూ కొనసాగింది.
గిరి ప్రదక్షిణకు అంచనాలకు మించి రాక
ఇతర ప్రాంతాలకు పాకిన ప్రాశస్త్యం
హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి,
కాకినాడల నుంచి వచ్చిన వేలాది మంది
కిక్కిరిసిన రహదారులు
తిరుగు ప్రయాణం
ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం
వేపగుంట, గోపాలపట్నం,
హనుమంతవాక జంక్షన్లలో నిలిచిపోయిన వందలాది వాహనాలు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
సింహ‘గిరి ప్రదక్షిణ’కు ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు విచ్చేశారు. భూ ప్రదక్షిణతో సమానమని, కొండ చుట్టూ 32 కి.మీ. కాలినడకన తిరిగితే పుణ్యఫలం లభిస్తుందని విస్తృతంగా ప్రచారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల నుంచి మహిళలు పిల్లలను తోడుగా తెచ్చుకొని ప్రదక్షిణ చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గురువారం ఉదయం 10 గంటల వరకూ కొనసాగింది.
ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నిర్దేశించిన మార్గాలు కిక్కిరిసి పోయాయి. చాలామంది అడవివరం నుంచి కృష్ణాపురం, హనుమంతవాక, అప్పుఘర్, ఎం.వి.పి.కాలనీ మీదుగా వెంకోజీపాలెం చేరుకొని...అక్కడి నుంచి హెచ్‌బీ కాలనీ వైపు వెళ్లకుండా నేరుగా జాతీయ రహదారిపైనే నడక కొనసాగించారు. వారు అలా ఇసుకతోట, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, బిర్లా జంక్షన్, ఎన్‌ఏడీ మీదుగా గోపాలపట్నం నుంచి పెట్రోల్ బంక్‌కు చేరుకొని శ్రీనివాస నగర్, ప్రహ్లాదపురం మీదుగా సింహాచలం చేరుకున్నారు. ఇటు నుంచి వెళ్లేవారు, అటు నుంచి వచ్చేవారితో గోశాల జంక్షన్ గురువారం ఉదయం కిక్కిరిసిపోయింది.
అధికారులు భక్తుల సంఖ్యకు తగినట్టు వసతి ఏర్పాట్లు అంటే తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి శిబిరాలు ఏర్పాటుచేశారు గానీ వచ్చిన వారిని ఏ మార్గాల ద్వారా బయటకు పంపించాలో ప్రణాళిక రూపొందించుకోలేదు. భక్తుల నడకకు ఇబ్బంది లేకుండా వాహనాల ట్రాఫిక్‌ను మళ్లించారు గానీ లక్షలాదిగా వచ్చిన భక్తులను ఎటు నుంచి అనుమతించి, ఎటు వైపు పంపాలనే దానిపై యోచన చేయలేదు. భక్తులు గిరి ప్రదక్షిణ చేసిన తరువాత బస్సుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. గోశాల వద్ద బస్సులను పెట్టారు. అక్కడికి చేరుకోవడానికి వీలు కాలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బస్సులు కదలలేదు. ఉన్నవి బయటకు వెళ్లలేదు. బయట ఉన్నవి లోపలకు రాలేదు. ఇలా గురువారం ఉదయం కొన్ని గంటలు నడిచింది. కొందరు గోశాల జంక్షన్ నుంచి వేపగుంట వైపు రావడంతో వేపగుంట మార్గం కూడా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జామ్ అయింది. ఈ రకమైన సమస్యలు వస్తాయని అసలు పోలీసులు ఊహించలేదు. అదేవిధంగా బుధవారం రాత్రి భక్తులు హనుమంతవాక మలుపులో రోడ్డును ఇటు నుంచి అటు దాటడం వల్ల ట్రాఫిక్ మద్దిలపాలెం వరకు నిలిచిపోయింది. పోలీసులు అంతా సింహాచలం వైపే ఉండడంతో ఇక్కడ సమస్యను పరిష్కరించేవారు కరవయ్యారు. కొత్తగా వేపగుంట జంక్షన్, గోశాల, తొలిపావంచాల వద్ద కూడా ట్రాఫిక్ ప్లాన్ చేసుకోవలసి ఉందని అధికారులకు అనుభవంలోకి వచ్చింది.