Share News

కేజీహెచ్‌లో సికిల్‌సెల్‌ పరీక్షలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:28 AM

కేజీహెచ్‌లో మరో అత్యాధునిక పరీక్ష కేంద్రం అందుబాటులోకి రాబోతోంది. గిరిజనుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సెంటర్‌ ఆఫ్‌ కాంపెటెన్స్‌ (సీవోసీ)ను కేజీహెచ్‌లో ఏర్పాటుచేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సెంటర్‌లో సికిల్‌సెల్‌ ఎనీమియా జబ్బు స్థాయి తెలుసుకునేందుకు అవసరమైన జన్యు పరీక్షలను నిర్వహించనున్నారు.

కేజీహెచ్‌లో  సికిల్‌సెల్‌ పరీక్షలు

జన్యు పరీక్ష కేంద్రం ఏర్పాటుకు

రూ.4 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఈ సెంటర్‌తో గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతో మేలు

విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో మరో అత్యాధునిక పరీక్ష కేంద్రం అందుబాటులోకి రాబోతోంది. గిరిజనుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సెంటర్‌ ఆఫ్‌ కాంపెటెన్స్‌ (సీవోసీ)ను కేజీహెచ్‌లో ఏర్పాటుచేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సెంటర్‌లో సికిల్‌సెల్‌ ఎనీమియా జబ్బు స్థాయి తెలుసుకునేందుకు అవసరమైన జన్యు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమయ్యే రూ.4 కోట్లను కేంద్రం మంజూరుచేసింది. మరో మూడు నెలల్లో ఇక్కడ జన్యు పరీక్షలను ప్రారంభించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిధులతో ఈ సీవోసీ ఏర్పాటుచేయనున్నారు. ఈ సెంటర్‌లో భార్య,భర్తల నుంచి రక్త నమూనాలను సేకరించి వారికి సికిల్‌సెల్‌ ఎనీమియా ఉందా?, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉందన్నది నిర్ధారించనున్నారు. వారి నుంచి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుందా?, ...అన్నది తెలుసుకునే పరీక్షలను కూడా చేస్తారు. అలాగే, శిశువుల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఇక్కడ పరీక్షిస్తారు. దీనివల్ల ముందుగానే సికిల్‌సెల్‌ ఎనీమియా సమస్యను గుర్తించి అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఎపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు. జన్యుపరీక్ష కేంద్రాన్ని ఆస్పత్రిలోని ఎమర్జన్సీ వార్డు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో గిరిజనులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో సికిల్‌సెల్‌ ఎనీమియా ఒకటిగా కేంద్రం గుర్తించింది. శరీరంలోని ఎర్ర రక్తకణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే జన్యుపరమైన రుగ్మతను సికిల్‌సెల్‌ ఎనీమియాగా పేర్కొంటారు. గత కొన్నాళ్లుగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సమస్యను 2047 నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా సికిల్‌సెల్‌ ఎనీమియా అధికంగా ఉన్న ఏపీతో సహా 17 రాష్ట్రాల్లో జన్యు పరీక్షల కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది.

Updated Date - Aug 21 , 2025 | 01:28 AM