కశింకోట పూర్వ రెవెన్యూ అధికారులకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:45 AM
సుమారు ఐదేళ్ల క్రితం కశింకోట తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారుతోపాటు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, పలు గ్రామాలకు చెందిన వీఆర్వోలపై అవినీతి నిరోధక శాఖ మోపిన అభియోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు.
అవినీతి ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
కశింకోట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సుమారు ఐదేళ్ల క్రితం కశింకోట తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారుతోపాటు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, పలు గ్రామాలకు చెందిన వీఆర్వోలపై అవినీతి నిరోధక శాఖ మోపిన అభియోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. వీటిపై పది రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
కశింకోట తహశీల్దారుగా బత్తుల సుధాకర్ పనిచేసిన సమయంలో మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు 2020 సెప్టెంబరు 2వ తేదీన తహశీల్దారు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తహశీల్దారు సుధాకర్, ఒక ప్రైవేటు వ్యక్తిని కంప్యూటర్ అపరేటర్‌గా నియమించుకున్నారు. అంతేకాక నెల వారీ జీతం ఇస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. ఈ సమయంలో జూనియర్ అసిస్టెంట్ సీతారాం అల్మారాలో ఉంచిన హ్యాండ్‌బ్యాగ్‌లో రూ.23,555 నగదు, కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ టేబుల్‌డెస్కులో అనధికార కంప్యూటర్ ఆపరేటర్ పి.మణికంఠ రాజ్‌కుమార్‌కు చెందిన పర్సులో రూ.3,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక లంచాలు ఇవ్వని 48 మంది రైతులకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాలను తహశీల్దారు తన గదిలో ఒక అల్యూమినియం పెట్టెలో దాచిపెట్టారు. మీసేవా కేంద్రం ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా క్లియర్ చేసినందుకు ప్రతిఫలంగా డబ్బులను డిజిటల్ ప్లాట్ ఫారాల ద్వారా స్వీకరించినట్టు ఆధారాలు లభించాయి. తహశీల్దారుగా ఉండి కిందిస్థాయి ఉద్యోగుల విధులను పర్యవేక్షించడంలో విఫలమైనట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. మీ-సేవ దరఖాస్తుల రిజిస్టర్, వ్యక్తిగత నగదు ప్రకటన రిజిస్టర్, మూవ్‌మెంట్ రిజిస్టర్ సరిగా నిర్వహించలేదని గుర్తించారు. అనంతరం రికార్డులను తమ వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. పలువురు ఫిర్యాదుదారులను విచారించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యుటేషన్, వివిధ రకాల ధ్రువపత్రాల జారీలో ఆర్‌ఐ నుంచి తహశీల్దారు వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు వారు చెప్పారు. లంచాలు ఇవ్వకపోతే దరఖాస్తులను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిన ఏసీబీ ఉన్నతాధికారులు.. సివిల్ సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి విధులు నిర్వహించినట్టు నివేదికను రెవెన్యూ శాఖకు సమర్పించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి సాయిప్రసాద్, ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వీటిపై పది రోజుల్లో సంబంధిత అధికారికి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
నోటీసులు జారీ అయిన ఉద్యోగులు..
ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో తహశీల్దారుగా వున్న బత్తుల సుధాకర్‌తోపాటు అప్పుటి డిప్యూటీ తహశీల్దారు వేదూరి శేషుబాబు, ఆర్‌ఐలు పి.కిశోర్‌కుమార్, జేవీ సత్యనారాయణ, మండల సర్వేయర్ కె.దినేశ్, సీనియర్ అసిస్టెంట్ బి.సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ డి.సీతారాం, వీఆర్వోలు పొన్నాడ శ్రీనివాసరావు, తొమ్మండ్రు అప్పారావు (బయ్యవరం), కె.సన్యాసిరావు (వెదురుపర్తి), కేవీఎస్ సుబ్రహ్మణ్యం (గొబ్బూరు), బండారు నాయుడుబాబు (కొత్తపల్లి), ఆర్.శ్రీనివాసరావు (జి.భీమవరం), ఎస్.చెల్లమాంబ (తీడ), బొడ్డేడ శివాజీ (జి.తాళ్లపాలెం), జి.ప్రసాద్ (సోమవరం, ఏఎస్‌పేట), మేడిశెట్టి దేవి (ఈ.చౌడవాడు, సుందరయ్యపేట), ఆడారి కిశోర్‌బాబు (చరకాం, అడ్డాం, అచ్చెర్ల), ఎన్.మీనాకుమారి (ఏనుగుతుని, ఎన్‌జీ పాలెం), బి.అజిత్ శ్రీనివాస్ (చింతలపాలెం), వేగి నరసింగరావు (పేరంటాలపాలెం, తేగాడ)లకు నోటీసులు జారీ అయ్యాయి.