కశింకోట బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:01 AM
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారికి మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన స్థానిక వైసీపీ నేతలు పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. దీనిపై అందిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన తరువాత హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశామని డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు.
పాఠశాలలో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు చర్యలు
కశింకోట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారికి మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20వ తేదీన స్థానిక వైసీపీ నేతలు పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. దీనిపై అందిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన తరువాత హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేశామని డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో రాజకీయ పార్టీల సమావేశాలు, ప్రచారాలు నిర్వహించకూడదని ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసిందన్నారు. ఈ మేరకు జీవో కాపీతోపాటు షోకాజ్ నోటీసును హెచ్‌ఎంకు పంపారు. కాగా పాఠశాలలో వైసీపీ నేతల కార్యక్రమంపై హెచ్‌ఎం స్వర్ణకుమారిని వివరణ కోరగా.. జీవో విషయం తెలియక ఉన్నత పాఠశాలలో జన్మదిన వేడుకలను నిర్వహించామని చెప్పారు. షోకాజ్ నోటీసుపై మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇస్తే దానిని ఉన్నతాధికారులకు పంపిస్తానని డీఈవో చెప్పినట్టు ఆమె తెలిపారు.
విద్యార్థినులతో ‘జై జగన్’ నినాదాలు!
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీన స్థానిక వైసీపీ నేత మళ్ల బుల్లిబాబు, సర్పంచ్ మంత్రి జయరజని, మరికొంతమంది వైసీపీ నాయకులు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు వెళ్లారు. విద్యార్థినుల మధ్య జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని హెచ్‌ఎం స్వర్ణకుమారికి చెప్పారు. ఆమె నిరాకరించకపోగా వైసీపీ నాయకులను వెంటబెట్టుకుని ప్రతి తరగతి గదికి వెళ్లి బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా మళ్ల బుల్లిబాబు మాట్లాడుతూ, మీరంతా జగన్(మామ)ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని బాలికలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. అనంతరం జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేయించారు.