కొత్త రేషన్ డిపోలను డీలర్లకు అప్పగించరా?
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:39 AM
జిల్లాలో కొత్తగా మంజూరైన రేషన్ డిపోలతోపాటు, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పాత డిపోలకు డీలర్ల నియామకానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి తుదిజాబితాను ప్రకటించారు. తరువాత ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. ఇది జరిగి మూడు నెలలు దాటినప్పటికీ డిపోల నిర్వహణను వీరికి అప్పగించలేదు. అధికారుల తీరుపై కొంతమంది అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం నియామకపత్రాలు అందజేసి చేతులు దులుపుకున్న అధికారులు
జిల్లాలో 60 రేషన్ దుకాణాలు ఖాళీ
వీటితోపాటు కొత్తగా 30 రేషన్ షాపుల డీలర్ల భర్తీకి గత డిసెంబరులో నోటిఫికేషన్
అదే నెలలో పరీక్ష, ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియ పూర్తి
నియామకపత్రాలు సైతం జారీ
ఇంతవరకు రేషన్ డిపోలను అప్పగించని వైనం
అచ్యుతాపురం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మంజూరైన రేషన్ డిపోలతోపాటు, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పాత డిపోలకు డీలర్ల నియామకానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి తుదిజాబితాను ప్రకటించారు. తరువాత ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. ఇది జరిగి మూడు నెలలు దాటినప్పటికీ డిపోల నిర్వహణను వీరికి అప్పగించలేదు. అధికారుల తీరుపై కొంతమంది అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 30 రేషన్ డిపోలతోపాటు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 60 రేషన్ డిపోలకు డీలర్ల నియామకానికి అధికారులు గత ఏడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 26న రాత పరీక్ష, 27న ఇంటర్వ్యూలు నిర్వహించారు. తరువాత ఎంపికైన అభ్యర్థులతో తుది జాబితాను సైతం విడుదల చేశారు. వెంటనే ఒక్కో అభ్యర్థి నుంచి పౌరసరఫరాల శాఖకు రూ.20 వేలు, డీలర్ పేరున వెయ్యి రూపాయల చలానా కూడా కట్టించుకున్నారు. డిపో నిర్వహణకు సొంత షాపు ఉండాలి. ఒకవేళ అద్దె షాపు అయితే ఐదు సంవత్సరాలపాటు లీజు తీసుకున్నట్టు అగ్రిమెంట్లు కూడా తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత డిపోలు అప్పగిస్తామని, ఫిబ్రవరి నుంచి రేషన్ సరఫరా అవుతుందని చెప్పారు. అయితే సంక్రాంతి తరువాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిపోలు అప్పగించడం అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి, కోడ్ ఎత్తివేసి నెల రోజులు దాటింది. అయినాసరే కొత్త వారికి రేషన్ డిపోల బాధ్యతలు అప్పగించలేదు.
కాగా అచ్యుతాపురం మండలం ఎంజేపురంలో మేరుగు నూకరాజు అనే దివ్యాంగుడిని రిజర్వేషన్ విధానంలో గతంలో రేషన్ డీలర్‌గా నియమించారు ఆయన రెండేళ్ల క్రితం చనిపోయాడు. అధికారులు ఈ డిపో నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా డ్వాక్రా సంఘానికి అప్పగించారు. కాని దీనిని ప్రస్తుతం వైసీపీ నాయకులు నడుపుతున్నారు.
త్వరలో డిపోలు అప్పగిస్తాం
కేవీఎస్‌ఎన్‌మూర్తి, డీఎస్‌ఓ
జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి మొత్తం 90 రేషన్ డిపోలకు డీలర్ల నియామకం కోసం గత ఏడాది డిసెంబరులో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశాం. అయితే వివిధ అంశాలపై 30 మంది కోర్టుని ఆశ్రయించారు. వీరిలో ఆరుగురు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో 66 మందికి నియామక ఉత్తర్వులు అందజేశాం. మిగిలిన వారి విషయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటాం. త్వరలో రేషన్ డిపోల బాధ్యతలను అప్పగిస్తాం.