Share News

ఉమ్మడి జిల్లాలో తహశీల్దార్ల కొరత

ABN , Publish Date - Jun 28 , 2025 | 01:12 AM

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్‌ బియ్యం పంపిణీ చేయడంలో డీలర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో తహశీల్దార్ల కొరత

  • అల్లూరి జిల్లాలో ఎనిమిది పోస్టులు ఖాళీ

  • విశాఖ, జిల్లాలో ఐదు, అల్లూరి జిల్లాలో మూడు...

  • ఇన్‌చార్జులతో కాలక్షేపం

  • రోజువారీ పాలనలో ఇబ్బందులు

  • అడ్‌హాక్‌ పదోన్నతులతోనే సమస్య పరిష్కారం

  • ఆ దిశగా దృష్టిసారించని మూడు జిల్లాల ఉన్నతాధికారులు

విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలో తహశీల్దార్లకు కొరత ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎనిమిది, విశాఖపట్నం జిల్లాలో ఐదు, అనకాపల్లి జిల్లాలో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెలలో విశాఖ జిల్లాలో మరో ముగ్గురు తహశీల్దార్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఖాళీల సంఖ్య ఎనిమిదికి పెరగనున్నది. పూర్తిస్థాయి తహశీల్దార్లు లేకపోవడంతో మండలాల్లో పాలనపై ప్రభావం పడుతోంది. అయితే తహశీల్దారు ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. కానీ, సర్వీస్‌ కమిషన్‌ ద్వారా వచ్చిన ప్రోడీటీలు, జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి పదోన్నతి ద్వారా డిప్యూటీ తహశీల్దార్లు అయిన వారి మధ్య కోర్టులో వివాదం ఉండడంతో పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలంటే ప్రస్తుతం సీనియర్‌ డీటీలకు అడ్‌హాక్‌ పదోన్నతులు కల్పించి తహశీల్దార్లుగా నియమించవచ్చు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సీనియర్లతో జాబితా సిద్ధం చేసి భూపరిపాలనా ముఖ్య కమిషనర్‌ అనుమతి తీసుకున్నారు. కానీ ఎందుచేతనో ఆ దిశగా ఇంకా ప్రయత్నాలు ప్రారంభించలేదు.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఇటీవల చేపట్టిన బదిలీల్లో పలువురు తహశీల్దార్లు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లారు. అల్లూరి జిల్లా నుంచి ఇద్దరిని విశాఖ జిల్లాకు, ముగ్గురిని అనకాపల్లి జిల్లాకు, అనకాపల్లి జిల్లా నుంచి ఒకరిని అల్లూరి జిల్లాకు, విశాఖ నుంచి ఇద్దరిని అనకాపల్లి జిల్లాకు బదిలీ చేశారు. అయితే అనుకూలమైనచోట పోస్టులు రాలేదని విశాఖ జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లు సీసీఎల్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అల్లూరి జిల్లా నుంచి ఇద్దరు తహశీల్దార్లు ఇంకా విశాఖ జిల్లాకు రాలేదు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో గాజువాక, పెందుర్తి, ఆనందపురం, సీతమ్మధార, ములగాడ మండలాలకు తహశీల్దార్లను నియమించాల్సి ఉంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏకంగా ఎనిమిది మంది తహశీల్దార్లు కొరత ఏర్పడడంతో పాలన ముందుకుసాగడం లేదనే వాదన ఉంది. చింతపల్లి, జి.మాడుగుల, అనంతగిరి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాలకు పూర్తిస్థాయి తహశీల్దార్లు లేరు. అల్లూరి జిల్లా కలెక్టరేట్‌లో ఒక సూపరింటెండెంట్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జులు ఉన్న మండలాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం విద్యార్థులకు ధ్రువపత్రాలు కూడా సకాలంలో జారీకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లికి బదిలీ అయిన ఇద్దరూ అక్కడ చేరలేదు. దీనికితోడు మరో ఖాళీ ఉంది. దీంతో అనకాపల్లి జిల్లాలో మూడు ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇదిలావుండగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లలో కొద్దిమందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అప్పుడు తహశీల్దార్‌ పోస్టులు మరికొన్ని ఖాళీ అవుతాయి. ఈలోగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న మండలాల్లో సీనియర్‌ డీటీలకు అడహాక్‌ పదోన్నతులు ఇస్తే పాలన సజావుగా సాగుతుంది. ఇందుకు మూడు జిల్లాల కలెక్టర్లు సమావేశమై నిర్ణయం తీసుకోవల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల జాప్యం జరుగుతోందంటున్నారు.


రేషన్‌ పరేషాన్‌

వృద్ధులు, దివ్యాంగుల ఆచూకీ కోసం డీలర్ల పాట్లు

పౌర సరఫరాల శాఖ అందజేసిన జాబితాలో పేర్కొన్న చిరునామాలో కనిపించని వైనం

రెండు రోజుల్లో ఇద్దరి నుంచి నలుగురికి మాత్రమే పంపిణీ

ఆరిలోవ/అక్కయ్యపాలెం/ గాజువాక, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్‌ బియ్యం పంపిణీ చేయడంలో డీలర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెలకు సంబంధించి పంపిణీని నగరంలోని 641 డిపోల పరిధిలో గురువారం ప్రారంభించారు. డిపోల వారీగా వృద్ధులు/దివ్యాంగుల వివరాలను డీలర్లకు పౌర సరఫరాల శాఖ అందజేసింది. అయితే అధికారులు ఇచ్చిన జాబితాల్లో ఉన్న చిరునామాలకు వెళుతుంటే ఆయా ఇళ్లల్లో వృద్ధులు కనిపించడం లేదు. ఆరా తీస్తే మరోచోటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్లు ఇప్పుడు పనిచేయడం లేదు. ఇక వృద్ధ దంపతుల్లో ఒకరు మృతిచెందితే మరొకరు కుమారుడు లేదా కుమార్తె వద్దకు వెళ్లిపోతుండడంతో వారి అడ్రస్‌ దొరకడం లేదు. అలాగే ఒక డిపో పరిధిలో కార్డు ఉండగా, మరో డిపో పరిధిలో ప్రస్తుతం వృద్ధులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఇచ్చిన జాబితాలో పేర్కొన్న కార్డుదారుల్లో ఇద్దరు నుంచి ఐదుగురికి మాత్రమే డీలర్లు ఈ రెండు రోజుల్లో బియ్యం ఇవ్వగలిగారు. గత ప్రభుత్వంలో డీలర్లకు, కార్డుదారులకు మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఎండీయూల ద్వారా బియ్యం పంపిణీ చేయడంతో కార్డుదారుల్లో ఎవరెక్కడ ఉన్నారో డీలర్లకు ఇప్పుడు తెలియడం లేదు. వచ్చే ఐదారు రోజుల్లో వృద్ధులందరికీ రేషన్‌ పంపిణీ చేయలేమని అంటున్నారు. గాజువాక పరిధిలో ఒక డీలరు రెండు రోజుల్లో కేవలం నలుగురికే బియ్యం ఇచ్చారు. ప్రతినెలా ఒకటో తేదీన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బందికి తమ పరిధిలో వృద్ధులు, దివ్యాంగుల నివాసాలు తెలుసునని, వారి సాయం తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని డీలర్లు కోరుతున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 01:12 AM