Share News

తహశీల్దార్ల కొరత

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:30 AM

జిల్లాల విభజన తరువాత విశాఖకు తహశీల్దార్ల కొరత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మండలాల సంఖ్య తగ్గినా పని భారం ఏ మాత్రం తగ్గలేదు. ప్రొటోకాల్‌, పలు పథకాల అమలు, నిరంతరం కోర్టులకు హాజరు వంటి అంశాలతో రెవెన్యూ శాఖ ఉక్కిరిబిక్కిరవుతుంది.

తహశీల్దార్ల కొరత

ఇన్‌చార్జులతో నడుస్తున్న కలెక్టరేట్‌లోని రెండు సెక్షన్లు

మొత్తం నాలుగు ఖాళీలు

రెండు, మూడు మండలాల తహశీల్దార్లపై

ఫిర్యాదులున్నా...సమర్థులైన అధికారులు లేకపోవడంతో ఆచితూచి అడుగులేస్తున్న ఉన్నతాధికారులు

అల్లూరి జిల్లా నుంచి ఇద్దరు తహశీల్దార్లను ఏడాదిగా

రిలీవ్‌ చేయని వైనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లాల విభజన తరువాత విశాఖకు తహశీల్దార్ల కొరత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మండలాల సంఖ్య తగ్గినా పని భారం ఏ మాత్రం తగ్గలేదు. ప్రొటోకాల్‌, పలు పథకాల అమలు, నిరంతరం కోర్టులకు హాజరు వంటి అంశాలతో రెవెన్యూ శాఖ ఉక్కిరిబిక్కిరవుతుంది.

ప్రస్తుతం జిల్లాలో నాలుగు తహశీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, మరో తహశీల్దార్‌ సెలవులో ఉన్నారు. కలెక్టరేట్‌లో నాలుగు సెక్షన్లూ కీలకమైనవే. ప్రస్తుతం పాలన, భూ పరిపాలన సెక్షన్‌లకు మాత్రమే పూర్తిస్థాయి తహశీల్దార్లు ఉన్నారు. మెజిస్ట్రీరియల్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికలు, ఇతర విభాగాలు ఇన్‌చార్జుల పర్యవేక్షణలో ఉన్నాయి. పూర్తిస్థాయి తహశీల్దార్లు లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. అలాగే కలెక్టరేట్‌లో ప్రొటెక్షన్‌, జీవీఎంసీలో ఎస్టేట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా విశాఖ ఆర్డీవో కార్యాలయం ఏవో సెలవులో ఉన్నారు. వచ్చే జూలైలో కలెక్టరేట్‌ ఏవో, భూసేకరణ విభాగం తహశీల్దార్‌, భీమిలి ఆర్డీవో కార్యాలయ ఏవో పదవీ విరమణ చేయనున్నారు.

ఇదిలావుండగా జిల్లాలో ఇద్దరు, ముగ్గురు తహశీల్దార్లపై పలు రకాల ఫిర్యాదులున్నాయి. వీరి పనితీరుపై జిల్లా యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రెండు మండలాల్లో భూ వివాదాలపై నిత్యం పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. మరో తహశీల్దార్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అక్కడ డీటీపై భారం పడుతుంది. వారిని బదిలీ చేసి కొత్తవారిని నియమించాలంటే సమర్థులైన తహశీల్దార్ల కొరత ఉండడంతో యంత్రాంగం ఆచితూచి అడుగులేస్తోంది.

గత ఏడాది బదిలీల సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖకు ఇద్దరు తహశీల్దార్లను బదిలీ చేశారు. ఇప్పటివరకూ అక్కడ కలెక్టర్‌ రిలీవ్‌ చేయలేదు. విశాఖ వచ్చేందుకు అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నా.. అక్కడి కలెక్టర్లు ముందుకు రావడం లేదు.

జిల్లాల విభజనలో అనుభవం ఉన్న సీనియర్లు మిగిలిన రెండు జిల్లాలకు వెళ్లిపోయారని, ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంకా డీటీల నుంచి తహసీల్దార్లుగా పదోన్నతుల కోసం ఉమ్మడి జిల్లాలో 32 మంది ఎదురుచూస్తున్నారు. వీరిలో ప్రో డీటీలు 16 మంది, పదోన్నతిపై వచ్చినవారు మరో 16 మంది ఉన్నారు. పదోన్నతుల వివాదం కోర్టులో ఉండడంతో చాలాకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ప్రోడీటీలు, పదోన్నతి డీటీల మధ్య రాజీ కుదిరి కేసు ఉపసంహరించుకునేంత వరకు తహశీల్దార్ల పదోన్నతులు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ వివాదం కొన్నాళ్లు కొనసాగితే జిల్లాలో తహశీల్దార్ల కొరత మరింత పెరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:30 AM