Share News

హార్టికల్చర్‌కు అధికారుల కొరత

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:35 AM

ఉద్యాన శాఖలో అధికారుల కొరత కారణంగా రైతులకు సకాలంలో సేవలు అందడంలేదు.

హార్టికల్చర్‌కు అధికారుల కొరత

  • జిల్లాలో సగం క్లస్టర్లకు ఇన్‌చార్జిలే దిక్కు

  • ఒక్కో హెచ్‌వోకు ఐదారు మండలాల బాధ్యతలు

  • ఉద్యాన రైతులకు సేవల్లో తీవ్ర జాప్యం

చోడవరం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

ఉద్యాన శాఖలో అధికారుల కొరత కారణంగా రైతులకు సకాలంలో సేవలు అందడంలేదు. ఒక పక్క ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుంటే.. మరోవైపు ఆ శాఖలో పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడం పథకాల అమల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రత్యేకించి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు రెగ్యులర్‌ హార్టికల్చర్‌ అధికారులు కొరత ఉద్యాన రైతులకు శాపంగా మారింది.

చోడవరం క్లస్టర్‌ ఉద్యాన శాఖకు మూడేళ్లుగా రెగ్యులర్‌ హెచ్‌వో లేరు. ఈ క్లస్టర్‌ పరిధిలో చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలు ఉన్నాయి. ఇక్కడ హెచ్‌వోగా పనిచేసిన గణేశ్‌ మూడేళ్ల క్రితం పదోన్నతిపై పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి చోడవరానికి రెగ్యులర్‌ హెచ్‌వో లేరు. మాడుగుల హెచ్‌వో భానుపుష్పలీల... చోడవరం క్లస్టర్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో చోడవరానికి రెగ్యులర్‌ హెచ్‌వోను నియమించినప్పటికీ ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టకుండానే విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు బదిలీపై వెళ్లిపోయారు. ఇక మాడుగుల హెచ్‌వో భానుపుష్పలీల భీమిలికి బదిలీకావడంతో అక్కడకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి మాడుగుల, చోడవరం క్లస్టర్లకు ఇన్‌చార్జిలే దిక్కు అయ్యారు. ప్రస్తుతం మాడుగుల క్లస్టర్‌కు దేవరాపల్లి హెచ్‌వో, చోడవరం క్లస్టర్‌కు అనకాపల్లి హెచ్‌వో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. మాడుగుల క్లస్టర్‌ పరిధిలో మాడుగుల, రావికమతం మండలాలు ఉన్నాయి. దేవరాపల్లి హెచ్‌వో దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలతోపాటు మాడుగుల, రావికమతం మండలాలను పర్యవేక్షించాల్సి రావడం ఉద్యాన శాఖ కార్యక్రమాల అమలులో జాప్యం జరుగుతున్నది. చోడవరం ఇన్‌చార్జి హెచ్‌వో చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలతోపాటు అనకాపల్లి, అనకాపల్లి ఫారం, కశింకోట మండలాలను పర్యవేక్షించాల్సి వస్తున్నది. జిల్లాలో 24 మండలాలకుగాను ప్రస్తుతం ఐదుగురు హెచ్‌వోలు మాత్రమే వున్నారు. ఉద్యాన శాఖ అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందని పరిస్థితి నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యానవనానికి పెద్దపీట వేయడంతోపాటు, ఆయా పంటలు, తోటల సాగుకు ప్రోత్సాహకాలతోపాటు, రాయితీలు కూడా ఇస్తున్నది. బిందు, తుంపర సేద్యం పరికరాలకు రాయితీలు పెంచింది. జిల్లాలో వాణిజ్యపరంగా ఉద్యాన పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలు కూడా రూపొందించింది. దీంతో ఉద్యాన పంటల సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. కానీ అధికారులు అందుబాటులో లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఒక్కో హెచ్‌వో నాలుగైదు మండలాలను పర్యవేక్షించాల్సి రావడంతో రైతులు హెచ్‌వోల కోసం నిరీక్షించాల్సి వస్తున్నది. వాస్తవానికి ఉద్యానపంటల పరంగా మాడుగుల, చీడికాడ, రావికమతం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట మండలాల్లో పామాయిల్‌సాగు ఎక్కువగా ఉంది. చోడవరం, బుచ్చెయ్యపేట, చీడికాడ, రావికమతం మండలాల్లో జీడిమామిడి, మామిడి తోటలు, కూరగాయ పంటల సాగు ఎక్కువగానే ఉంది. ఇంతటి ముఖ్యమైన మండలాలకు రెగ్యులర్‌ హార్టికల్చర్‌ అధికారులు లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యాన శాఖకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:35 AM