చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:59 PM
స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత వెంటాడుతున్నది. వంద పడకలుగా స్థాయి పెంచినా ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయలేదు. ఈ ఆస్పత్రికి 23 వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కేవలం ఏడుగురు వైద్యులు ఉండగా.. వీరిలో ఇద్దరు ప్రసూతి సెలవులో ఉన్నారు.

23 మందికిగానూ ఉన్నది ఏడుగురు వైద్యులే
వీరిలో ఇద్దరు ప్రసూతి సెలవు
భర్తీకాని ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు
ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిల్
ప్రసవం కష్టమైతే మైదాన ప్రాంతాలకు తరలింపు
మెరుగైన వైద్యం అందక గిరిజనుల అవస్థలు
(ఆంధ్రజ్యోతి/చింతపల్లి)
స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత వెంటాడుతున్నది. వంద పడకలుగా స్థాయి పెంచినా ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయలేదు. ఈ ఆస్పత్రికి 23 వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కేవలం ఏడుగురు వైద్యులు ఉండగా.. వీరిలో ఇద్దరు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు జరగడం లేదు. ప్రసవం కష్టమైతే 50 కిలోమీటర్ల దూరంలోనున్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
చింతపల్లి ఏరియా ఆస్పత్రికి కొంత కాలంగా రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. చింతపల్లి, జీకేవీధి మండలాలు, కొయ్యూరు, జి.మాడుగుల సరిహద్దు పంచాయతీల ప్రజలు వైద్య సేవల కోసం ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు. 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రెండేళ్ల క్రితం 100 పడకలకు పెంచి ఏరియా ఆస్పత్రిగా మార్చారు. వంద పడకల ఆస్పత్రి భవనం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం అందుబాటులోనున్న భవనంలోనే రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ 350 నుంచి 450 మంది రోగులు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ 50 నుంచి 60మంది ఇన్‌పేంట్లుగా చేరుతున్నారు. రోజూ 6 నుంచి 8 ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రి రోగులతో రద్దీగా కనిపిస్తోంది. అయితే ఏరియా ఆస్పత్రికి కేటాయించిన వైద్యుల పోస్టులు భర్తీ కాకపోవడంతో గిరిజన రోగులు మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, కేజీహెచ్‌కి తరలించాల్సి వస్తున్నది.
భర్తీకాని వైద్యుల పోస్టులు
ఏరియా ఆస్పత్రిగా స్థాయి పెంచి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యుల పోస్టులు భర్తీ కాలేదు. 23 మంది వైద్యులకుగానూ కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఆస్పత్రిలో ముగ్గురు గైనికాజిస్టులకుగానూ కేవలం ఒకరు మాత్రమే ఉండగా.. ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాల నుంచి వారం రోజులకు ఒక గైనికాలజిస్టు డిప్యూటేషన్‌పై వచ్చి పగటిపూట మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిడియాట్రిక్స్‌గానూ ఒకరు మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో పెథాలజిస్టు వైద్యులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న నియామకాల్లో రెగ్యులర్ ఉద్యోగం వస్తే ఈ ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు వెళ్లిపోయే అవకాశం ఉంది. దంత వైద్యాధికారి ఒకరు, ముగ్గురు జనరల్ వైద్యులు ఉన్నారు. ఈఎన్‌టీ వైద్యులు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇద్దరు మత్తువైద్యులకు ఒక్క పోస్టు కూడా భర్తీకాలేదు. ఎస్‌ఎన్‌సీయూలోనూ ఇద్దరు పిడియాట్రిక్స్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్టు, అప్తామాలజీ సర్జన్, రెసిడెంట్ మెడికల్ అఫీసర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఆర్థోపెడిక్ వైద్యుడు రెండు రోజుల క్రితం రెగ్యులర్ పోస్టు రావడంతో వెళ్లిపోయారు. ఇద్దరు జనరల్ వైద్యులు మిస్ మ్యాచ్ పోస్టుల్లో పనిచేస్తున్నారని అనకాపల్లి, రంపచోడవరం బదిలీ చేశారు.
నేటికీ సీహెచ్‌సీ స్థాయి సేవలు..
ఏరియా ఆస్పత్రిలో నేటికి సీహెచ్‌సీ స్థాయి సేవలు మాత్రమే రోగులకు అందుతున్నాయి. రోగులకు వైద్యులు సాధారణ తనిఖీలు చేస్తున్నారు. శస్త్రచికిత్సలు జరగడం లేదు. మత్తువైద్యాధికారి, గైనికాలజిస్టులు లేకపోవడంతో సిజేరియన్ ప్రసవాలు జరగడంలేదు. సాధారణ ప్రసవాలు మాత్రమే ఆస్పత్రిలో జరుగుతున్నాయి. ప్రసవం కష్టమైతే గర్భిణులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. దీంతో పురిటినొప్పులతో గర్భిణులు 49 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఏరియా ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్యనిపుణుల కొరత వల్ల రిఫరల్ ఆస్పత్రిగా తయారైంది.
వైద్యనిపుణుల పోస్టులు భర్తీ చేయాలి
కోరాబు అనుషదేవి, ఎంపీపీ, చింతపల్లి
ఏరియా ఆస్పత్రిలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆదివాసీ రోగులకు మెరుగైన చికిత్స అందడం లేదు. ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ చేస్తే మైదాన ప్రాంతాలకు తరలించే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. వైద్యుల భర్తికి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేయాలి.