Share News

రేపటి నుంచి షాపింగ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:02 AM

జీఎస్‌టీపై ప్రజలకు అవగాహన కల్పించి, ధరలు ఎంత మేరకు తగ్గాయో వివరించడానికి, ఆయా వస్తువులను తగ్గింపు రేట్లపై అందించడానికి షాపింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు.

రేపటి నుంచి షాపింగ్‌ ఫెస్టివల్‌

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహణ

జీఎస్టీ 2.0పై అవగాహన, ఆయా వస్తువులను తగ్గింపు ధరలను అందించేందుకు ఏర్పాటు

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

జీఎస్‌టీపై ప్రజలకు అవగాహన కల్పించి, ధరలు ఎంత మేరకు తగ్గాయో వివరించడానికి, ఆయా వస్తువులను తగ్గింపు రేట్లపై అందించడానికి షాపింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఈ ఫెస్టివల్‌ ఉంటుందన్నారు. వ్యాపార సంస్థలు, డ్వాక్రా సంఘాలతో కలిసి సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు ఉంటాయని, అవగాహనకు శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇతర అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌టీ అదనపు కమిషనర్‌ ఎస్‌.శేఖర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంబాబు, డీటీఓ మాధవి, హోటల్స్‌ అండ్‌ టూరిజం అసోసియేషన్‌ ప్రతినిధి పవన్‌ కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.


33,812 మందికి బీపీ

21,786 మందికి షుగర్‌

క్యాన్సర్‌ బాధితులు 225 మంది...

జిల్లాలో ముగిసిన ఎన్‌సీడీ

(నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) 3.0 సర్వే

4.0 ప్రారంభం

క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడమే లక్ష్యం

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అసంక్రమిత వ్యాధుల (అంటువ్యాధులు కానివి)తో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు నిర్వహించిన ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) 3.0 సర్వే ముగిసింది. గడిచిన ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు నిర్వహించిన ఈ సర్వేలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను గుర్తించారు.

ఎన్‌సీడీ 3.0లో భాగంగా జిల్లాలో 18,32,792 మందిని పరీక్షించాల్సి ఉంది. అయితే 15,25,932 (83.26 శాతం) మందిని పరీక్షించారు. మరో 16.74 మందిని స్ర్కీనింగ్‌ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల నుంచి ఎన్‌సీడీ 4.0 సర్వేను జిల్లాలో అధికారులు ప్రారంభించారు. ఎన్‌సీడీ 3.0 సర్వే ప్రకారం జిల్లాలో 15 లక్షల మందికిపైగా ప్రజలను పరీక్షించగా, 62,180 మందికి హైపర్‌ టెన్షన్‌ (బీపీ) ఉన్నట్టు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. తదుపరి నిర్వహించిన పరీక్షల్లో 33,812 మంది బీపీతో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే 21,786 మంది షుగర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. ఇంకా 3,201 మందికి నోటి క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించి పరీక్షలు నిర్వహించగా 73 మందికి వ్యాధి ఉన్నట్టు తేలింది. అలాగే, రొమ్ము క్యాన్సర్‌ అనుమానిత కేసులు 1,969 గుర్తించగా, వారికి పరీక్షలు నిర్వహించగా 112 మందికి నిర్ధారణ అయ్యింది. అలాగే, సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలున్న 1,948 మందికి ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించగా 40 మందికి నిర్ధారణ అయింది. వారికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు.

4.0 సర్వే ప్రారంభం..

జిల్లాలో ఎన్‌సీడీ 4.0 సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే ప్రధానంగా క్యాన్సర్‌ కేసులను గుర్తించడమే లక్ష్యంగా సాగనుంది. 3.0 సర్వేలో క్యాన్సర్‌ కేసులు గుర్తింపు ఆశించిన స్థాయిలో జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు ఏడాదిపాటు అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీచేశారు. పట్టణాల్లో ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్త, ఎంఎల్‌హెచ్‌పీ ఇంటింటికీ వెళ్లి స్ర్కీనింగ్‌ చేయనున్నారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 4.0 సర్వే పూర్తిగా దానిపైనే సాగుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించేలా సర్వే జరగనుందన్నారు.


నేటి నుంచి విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు

డివిజన్‌లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

తమ డిమాండ్ల సాధనకు విద్యుత్‌ ఉద్యోగులు 15వ తేదీ (బుధవారం) నుంచి దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్న నేపథ్యంలో సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ జి.శ్యాంబాబు బుధవారం విలేకరులకు తెలిపారు. జోన్‌-1, జోన్‌-2, జోన్‌-3 డివిజన్ల పరిధిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనాలని సీఎండీ పృథ్వీతేజ్‌ ఆదేశించడంతో సిబ్బందితో పూర్తి సన్నద్ధతతో ఉన్నామన్నారు. సర్కిల్‌ కార్యాలయంతో పాటు జోనల్‌ కార్యాలయాలు 24/7 పనిచేస్తాయన్నారు. సరఫరా సమస్యలు ఎదురైతే 1912కు గాని, జోన్‌-1 9490610019, జోన్‌-2 9490610020, జోన్‌-3 9491030722 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Updated Date - Oct 15 , 2025 | 01:02 AM