Share News

జడ్పీ చైర్‌పర్సన్‌కు షాక్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:01 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర (వైసీపీ)పై సొంత పార్టీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

జడ్పీ చైర్‌పర్సన్‌కు షాక్‌

  • స్వపక్షంలోనే తిరుగుబాటు

  • సర్వసభ్య సమావేశానికి 22 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు

  • రెండు రోజుల కిందట అనకాపల్లిలో రహస్య సమావేశం

  • అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయం

  • సెప్టెంబరు 24 తరువాత నోటీస్‌?

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర (వైసీపీ)పై సొంత పార్టీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి 22 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

చైర్‌పర్సన్‌ తీరుపై అసంతృప్తితో 16 మంది జడ్పీటీసీ సభ్యులు ఈనెల ఆరో తేదీన అనకాపల్లిలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. సుభద్రకు ప్రత్యామ్నాయంగా జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు మత్స్యరాస వెంకటలక్ష్మిని జడ్పీ చైర్‌పర్సన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు సభ్యులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకుందామని, బుధవారం నాటి జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశించింది. పార్టీలో తిరుగుబాటు మంచిది కాదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఈనెల 13వ తేదీన సభ్యులతో తాను మాట్లాడతానని, జడ్పీ సర్వసభ్య సమావేశానికి వెళ్లాలని ఆయన సూచించారు. అయినప్పటకీ బుధవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి 22 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. వైసీపీ సభ్యులు 15 మంది (చైర్‌పర్సన్‌ సహా) మాత్రమే హాజరయ్యారు. జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు, సర్వసభ్య సమావేశం బుధవారమే నిర్వహించడంపై వారం క్రితం పార్టీ ఫ్లోర్‌ లీడరు, పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలుపుతూ వైసీపీ జడ్పీటీసీ సభ్యుల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు పెట్టగా అందరూ మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బొత్స సత్యనారాయణ...పరవాడ జడ్పీటీసీ సభ్యుడు సన్యాసిరాజును పిలిచి మాట్లాడారు. అయినప్పటికీ బుధవారం ఉదయం తొలుత స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సన్యాసిరాజు లేచి నిరసన వ్యక్తంచేశారు. ఒకేరోజు రెండు సమావేశాలు నిర్వహణతో అన్ని సమస్యలపై చర్చించలేమని చెప్పారు. కాగా జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర వ్యవహారశైలితోనే ఆమెపై తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని సభ్యులు చెబుతున్నారు. జడ్పీ సమావేశ మందిరం బయట రోలుగుంట జడ్పీటీసీ సభ్యురాలు పోతుల రమణమ్మ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 20 శాతం చైర్‌పర్సన్‌ తనకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారని, అయితే ఈ విషయం తమకు కనీసం చెప్పడం లేదని ఆరోపించారు. జిల్లాకు సాధారణ నిధులు ఏ మేరకు విడుదలయ్యాయి?, వాటిలో ఏఏ పద్దుల కింద ఎంత ఖర్చుచేశారు అనే వివరాలు రహస్యంగా ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీ కార్యాలయంలో సమావేశాలకు వచ్చే మహిళా సభ్యులకు కనీసం శుభ్రమైన మరుగుదొడ్లు కూడా లేవన్నారు. జడ్పీటీసీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ఏడాది సెప్టెంబరు 24 నాటికి నాలుగు సంవత్సరాలవుతోందని, తమకు కనీస మర్యాద, గౌరవం లేవని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ ఆరోపించారు. సెప్టెంబరు 24వ తేదీ తరువాత అవిశ్వాసం ప్రతిపాదిస్తామన్నారు. బుధవారం సమావేశానికి మైదాన ప్రాంతంలో 18 మంది, ఏజెన్సీలో నలుగురు హాజరుకాలేదు. వారిలో ఇద్దరు వైస్‌ చైర్మన్లు బీవీ సత్యవతి, సుంకరి గిరిబాబు ఉన్నారు. కాగా విశాఖ జిల్లాలో 39 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా ఇద్దరు మృతిచెందారు. మరొకరు రాజీనామా చేశారు. చైర్‌పర్సన్‌ను మినహాయిస్తే ప్రస్తుతం 35 మంది సభ్యులు ఉన్నారు. అందులో టీడీపీ, సీపీఎంలకు ఒక్కొక్క సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం ప్రతిపాదించాలంటే 21 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

Updated Date - Jul 10 , 2025 | 01:01 AM