వణికిస్తున్న చలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:57 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది.
తగ్గుముఖం పడుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
అరకులోయలో 8.1 డిగ్రీలు
పాడే రు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అల్పపీడనాల ప్రభావంతో డబల్ డిజిట్‌లో ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రస్తుత వాతావరణం కారణంగా సింగిల్ డిజిట్‌కు చే రుకుంటున్నాయి. శనివారం అరకులోయలో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత నమోదుకాగా, డుంబ్రిగుడలో 8.2, జి.మాడుగులలో 9.9, ముంచంగిపుట్టులో 10.1, హుకుంపేటలో 10.8, పెదబయలులో 11.4, చింతపల్లి, పాడేరులో 12.9, కొయ్యూరులో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గజగజలాడుతున్న ఏజెన్సీ వాసులు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతోపాటు ఎండ సైతం పెద్దగా కాయకపోవడంతో శీతల వాతావరణం కొనసాగుతున్నది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది.
జి.మాడుగులలో...
జి.మాడుగుల: మండలంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. జనం ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. శనివారం 9.9 డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు పొగమంచు దట్టంగా కురిసింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో చలి తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు.