వణికిస్తున్న చలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:43 PM
ప్రస్తుతం మన్యాన్ని చలి వణికిస్తున్నది. వాతావరణంలోని మార్పుల వలన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది.
అరకులోయలో 6.6 డిగ్రీలు
క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
పాడేరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మన్యాన్ని చలి వణికిస్తున్నది. వాతావరణంలోని మార్పుల వలన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. సుమారుగా వారం రోజుల నుంచి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. మధ్యాహ్నం వేళలో ఒక మోస్తరుగా మాత్రమే ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నాయి.
అరకులోయలో 6.6 డిగ్రీలు
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతుండడంతో మంగళవారం అరకులోయలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగులలో 7.4, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడలో 8.7, పాడేరులో 9.8, చింతపల్లి, హుకుంపేటలో 10.0, అనంతగిరిలో 11.6, కొయ్యూరులో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.