Share News

31న షిప్‌యార్డు సీఎండీ హేమంత్‌ ఖత్రీ పదవీ విరమణ

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:03 AM

షిప్‌యార్డు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) హేమంత్‌ ఖత్రీ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

31న షిప్‌యార్డు సీఎండీ హేమంత్‌ ఖత్రీ పదవీ విరమణ

మల్కాపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

షిప్‌యార్డు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) హేమంత్‌ ఖత్రీ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 2020 సెప్టెంబరు ఒకటో తేదీన సీఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ షిప్‌యార్డుకు భారీ ఆర్డర్‌లను తీసుకువచ్చారు. నౌకా నిర్మాణ రంగంలో షిప్‌యార్డుకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సీఎండీ పదవి కోసం అనేకమంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం సంస్థ డైరెక్టర్‌లుగా ఉన్నవారితోపాటు బయట వ్యక్తులు కూడా సీఎండీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


రిజిస్ర్టేషన్‌ కాగానే ఆటో మ్యుటేషన్‌

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో ఎవరు ఫ్లాటు, ఇల్లు కొనుగోలు చేసినా వాటి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే రికార్డుల్లో ఆటోమ్యుటేషన్‌ జరిగిపోయేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి ఇది అమలు కానున్నది. దీనిపై మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం డాక్యుమెంట్‌ రైటర్లకు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ అవగాహన కల్పించారు. ఖాళీ స్థలం/ఇల్లు/ఫ్లాట్‌ జీవీఎంసీ పరిధిలో కొంటే...సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే మ్యుటేషన్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే అదే సమాచారం జీవీఎంసీకి వెళుతుందని, అక్కడ ప్రత్యేకంగా దరఖాస్తు చేయకుండానే ఆటో మ్యుటేషన్‌ జరిగిపోతుందన్నారు. కొనుగోలుదారుల పేర్లు రికార్డులో అప్‌డేట్‌ అవుతాయని సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణి వివరించారు. పారదర్శకత పెరుగుతుందన్నారు.


ఉక్కును సెయిల్‌లో కలిపే ప్రతిపాదన లేదు

ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ స్పష్టీకరణ

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు)ను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టంచేశారు. మంగళవారం సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన ఎంపీ ఆదిత్య యాదవ్‌ ఈ అంశంపై పార్లమెంటులో ప్రశ్నించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఆర్థిక, ఆపరేషనల్‌ సమస్యలు ఉన్నందున సెయిల్‌లో విలీనం చేస్తారా?...అని అడగ్గా, అలాంటిదేమీ లేదని చెబుతూ, ఇప్పటికే రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం చేశామని, అదే తరహా సహాయం కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 01:03 AM