మెరిసిన తేజం
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:23 AM
అతడు అనుకున్నది సాధించాడు. వాయుసేనలో చేరి దేశ రక్షణలో తన వంతు పాత్ర పోషించాలని కన్న కలలను సాకారం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచీ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనే ఉత్సాహంతో రేయింబవళ్లు శ్రమించాడు. చివరికి ఎయిర్ ఫైటర్‌గా ఎంపికై గ్రామానికి వన్నె తెచ్చాడు.
భారత వాయుసేనలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైన తేజస్
పద్మనాభం మండలం అనంతవరం యువకుడి ప్రతిభ
పుత్రోత్సాహంతో ఉప్పొంగిన తల్లిదండ్రులు
పద్మనాభం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
అతడు అనుకున్నది సాధించాడు. వాయుసేనలో చేరి దేశ రక్షణలో తన వంతు పాత్ర పోషించాలని కన్న కలలను సాకారం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచీ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనే ఉత్సాహంతో రేయింబవళ్లు శ్రమించాడు. చివరికి ఎయిర్ ఫైటర్‌గా ఎంపికై గ్రామానికి వన్నె తెచ్చాడు.
పద్మనాభం మండలం అనంతవరం గ్రామానికి చెందిన కసిరెడ్డి శివన్నారాయణ, సంధ్య దంపతుల కుమారుడు తేజస్ వాయుసేనలో ఎయిర్ ఫైటర్‌గా ఎంపికయ్యాడు. తండ్రి యాడ్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. సోదరి షర్మిల బీటెక్ చదువుతోంది. వాయుసేనలో శిక్షణ పూర్తిచేసుకుని, పట్టా పొందిన సమయంలో హైదరాబాద్ వెళ్లిన తల్లిదండ్రులు కుమారుడి ప్రతిభతో సంబరాలు చేసుకున్నారు. తండ్రి శివన్నారాయణ తేజెస్‌ను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయారు.
అనంతవరం గ్రామానికి చెందిన కశిరెడ్డి ఎస్‌వీటీ తేజస్ భారత వాయుసేనలో శిక్షణ పొందాడు. ఇటీవల హైదరాబాద్‌లోని అకాడమీలో 216 బీటెక్ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ శిక్షణ పూర్తిచేసుకున్నారు. అక్కడ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేతులమీదుగా ఫైటర్ పైలట్ (వింగ్స్)గా పట్టాను అందుకున్నాడు. తేజస్ 2015 నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. 2021లో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) జాతీయస్థాయి పరీక్ష రాసి అఖిల భారత స్థాయిలో 127వ ర్యాంకును సాధించాడు. 2022లో భారత వాయుసేనకు ఎంపికై హైదరాబాద్ వాయుసేన అకాడమీలో బీటెక్ కోర్సును, శిక్షణను పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం అతడిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేటాయించారు. మన రాష్ట్రం నుంచి వాయుసేన విభాగంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైన ఏకైక వ్యక్తిగా నిలవడంతో గ్రామంలో సంబరాలు జరిగాయి.