Share News

25 ఎకరాల్లో శిల్పారామం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:18 PM

జిల్లాలో పర్యాటకాభివృద్థిలో భాగంగా పాడేరు, హుకుంపేట సమీపంలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని, 25 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

25 ఎకరాల్లో శిల్పారామం
అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, హుకుంపేట సమీపంలో ఏర్పాటుకు భూ సేకరణ

డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో 15 హోమ్‌ స్టేలకు చర్యలు

పర్యాటకులు సేదతీరడంతో పాటు గిరిజనులకు ఉపాధి

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటకాభివృద్థిలో భాగంగా పాడేరు, హుకుంపేట సమీపంలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని, 25 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన జూమ్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యాటకులకు గిరిజన గ్రామాల్లో సేదతీరేందుకు హోమ్‌ స్టేలు ఏర్పాటు చేస్తే గిరిజనుల ఉపాఽధి, అభివృద్ధికి దోహదపడతాయన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు పాత గృహాలను తొలగించకుండా కొత్త గృహాలను నిర్మించుకోవాలన్నారు. పాత ఇళ్లను పర్యాటకుల హోమ్‌ స్టేలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నారు. హోమ్‌ స్టేలలో పర్యాటకులకు గిరిజన వంటల రుచులను చూపించాలన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటించిన డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో 15 హోమ్‌ స్టేలు ఏర్పాటు చేయడానికి అవసరమైన గిరిజన గృహాలను గుర్తించాలని ఆదేశించారు. హోమ్‌ స్టేలకు సెర్ప్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని, ఫలితంగా సామాజిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అలాగే చింతపల్లి మండలం తాజంగి, లంబసింగి గ్రామాల్లో ఇళ్లను గుర్తించాలని ఎంపీడీవోకు సూచించారు.

మెయిన్‌రోడ్ల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

పర్యాటక ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు గానూ అరకులోయ, రంపచోడవరం, పాడేరు, అడ్డతీగల, రాజవొమ్మంగి మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలు కలుషితం కాకుండా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించే షాపులను తనిఖీ చేసి సీజ్‌ చేయాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై చెక్‌ పోస్టుల ఏర్పాటుపై ఆరా తీశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిరోధించాలన్నారు. రోడ్డుకిరువైపులా ఆక్రమణలు జరగకుండా పంచాయతీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆక్రమణలపై తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, డీఎఫ్‌వో పీవీ.సందీప్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా పర్యాటకాధికారి జి.దాసు, రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీ సీపీవో ఎస్‌ఆర్‌ఎస్‌కే.పట్నాయక్‌, అరకులోయ గిరిజన మ్యూజియం క్యూరేటర్‌ మురళి, 22 మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవో పీఆర్‌డీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:18 PM