చెలరేగిన షెఫాలీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:26 AM
భారత్ మహిళలు చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు.
జత కలిసిన జెమీమా
ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిన స్టేడియం
రెండో టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం
శ్రీలంకను 128 పరుగులకే కట్టడి చేసిన బౌలర్లు
రెండేసి వికెట్లు తీసిన శ్రీచరణి, వైష్టవి శర్మ
విశాఖపట్నం స్పోర్ట్స్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
భారత్ మహిళలు చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజానందించారు. షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించింది. మంగళవారం ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. శ్రీలంక నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించింది.
22 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 128 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే విష్మి గుణరత్నే అవుటైంది. అయితే కెప్టెన్ చతుర ఆటపట్టు క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించింది. క్రాంతి రాణా వేసిన రెండో ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాదిన అటపట్టు....మ్యాచ్ ఐదో ఓవర్‌లో అరుంధతి బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ కొట్టి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. జోరు మీదున్న ఆటపట్టు మరోసారి భారీ షాట్‌కు యత్నించి క్రాంతి రాణా బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్‌లో అమన్‌జోత్ కౌర్ క్యాచ్ పట్టడంతో రెండో వికెట్‌గా వెనుతిరిగింది. ఆటపట్టు స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్షిత మాధవి దూకుడుగా ఆడింది. అయితే 13 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్న శ్రీలంక...ఆ తర్వాత కేవలం 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. శ్రీచరణి రెండు వికెట్లు తీసుకుంది.
అజేయ అర్ధ సెంచరీతో రెచ్చిపోయిన షెఫాలీ
భారత్ 129 పరుగుల లక్ష్యంతో దిగింది. ఓపెనర్ షెఫాలీ అజేయ అర్ధ సెంచరీతో (69 నాటౌట్) రెచ్చిపోయింది. కేవలం 34 బంతుల్లో 11 బౌండరీలు, రెండు సిక్సర్‌తో లంక బౌలర్లను చెండాడింది. మ్యాచ్ ఐదో ఓవర్...రణవీర బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదిన షెఫాలీ ...ఆరో ఓవర్‌లో జోరు కొనసాగించి ఆటపట్టు బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్, బౌండరీ కొట్టి స్కోరు బోర్డును పరుగులెత్తించింది. షెఫాలీకి జత కలిసిన జెమీమా కూడా శ్రీలంక బౌలర్లను ఆడుకుంది. ఏడో ఓవర్లో రణవీర బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్సర్, బౌండరీ, స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టి షెఫాలీతో పోటీపడింది. కేవలం 27 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసిన షెఫాలీ...అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను ముగించేసింది. ఆరంభంలో స్మృతి మంధానా సిక్సర్, బౌండరీ కొట్టి ప్రేక్షకులను అలరించింది.
వైష్ణవి శర్మకు తొలి వికెట్
రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైష్ణవి శర్మ....18 ఓవర్‌లో నీలాక్షి శివను అవుట్ చేసి కెరీర్‌లో తొలి వికెట్ దక్కించుకుంది. దీంతో జట్టు సభ్యులందరూ వైష్ణవిని అభినందించారు.