Share News

ఆహార కల్తీ నియంత్రణకు ‘షీ’ టీమ్స్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:21 AM

నగరంలో ఆహారకల్తీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం శానిటేషన్‌ అండ్‌ హెల్త్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (షీ) బృందాలను ఏర్పాటుచేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

ఆహార కల్తీ  నియంత్రణకు ‘షీ’ టీమ్స్‌

హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో నిరంతర తనికీలు

ప్రతి జోన్‌కు రెండేసి బృందాలు

16 బృందాలు...50 చోట్ల సోదాలు

సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగానికి కూడా చెక్‌

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఆహారకల్తీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం శానిటేషన్‌ అండ్‌ హెల్త్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (షీ) బృందాలను ఏర్పాటుచేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు, బేకరీలు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహారకల్తీ, నాణ్యత, పరిశుభ్రత లోపంపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిల్వ ఆహారం, ఆరోగ్యానికి హాని కలిగించే రంగులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు దరిచేరుతున్నాయన్నారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి కేసులు నమోదుచేసి వదిలేయడం వల్ల వ్యాపారుల ధోరణిలో మార్పురావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆహారం విక్రయించే దుకాణాలు, హోటళ్లు, బేకరీలపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి జోన్‌కు రెండేసి షీ టీమ్స్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. ఒక్కో బృందంలో సహాయ వైద్యాధికారితోపాటు శానిటేషన్‌ సూపర్‌వైజర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఉంటారన్నారు. ఒక్కో బృందం ప్రతీరోజూ రెండు, మూడు హోటళ్లు/రెస్టారెంట్‌లు/బేకరీలు/స్టీట్‌ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు చేయాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల నగరంలో ప్రతీరోజూ 16 బృందాలు కనీసం 50 చోట్ల తనిఖీలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయాచోట్ల వినియోగించే ముడిపదార్థాలు, విక్రయించే ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతను పరిశీలిస్తాయన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా బయో డీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ లేదా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించేలా చర్యలు తీసుకుంటారన్నారు. కొన్నాళ్లు పరిశీలించిన తర్వాత ఇంకా తనిఖీలను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే ప్రతీజోన్‌కు అదనంగా రెండు చొప్పున బృందాలను నియమిస్తామన్నారు. ప్రతిరోజూ తనిఖీలు జరుగుతాయనే విషయం తెలిసినట్టయితే వ్యాపారులు ఆహార నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - Aug 12 , 2025 | 01:21 AM