Share News

షర్మిల వ్యవహారశైలితో పార్టీ నిర్వీర్యం

ABN , Publish Date - May 20 , 2025 | 01:26 AM

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యవహారశైలితో పార్టీ నిర్వీర్యమవుతోందని పలువురు నాయకులు విమర్శించారు.

షర్మిల వ్యవహారశైలితో పార్టీ నిర్వీర్యం

  • విశాఖలో అసమ్మతి నేతల సమావేశం

  • పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ హాజరు

  • అగ్రనాయకత్వం దృష్టికి సమస్యను తీసుకువెళతానన్న కిల్లి కృపారాణి

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యవహారశైలితో పార్టీ నిర్వీర్యమవుతోందని పలువురు నాయకులు విమర్శించారు. షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులు సోమవారం దొండపర్తిలోని హోటల్‌ సింకా గ్రాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హాజరయ్యారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నాయకులను షర్మిల పట్టించుకోవడం లేదని పలువురు నేతలు ఆరోపించారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుగుణంగా ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ మరింత అధ్వాన స్థితికి చేరుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సీనియర్లు అగ్రనాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి సంస్థాగతంగా బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ పార్టీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విషయాన్ని తనకు తెలియజేశారన్నారు. పార్టీ పెద్దలతో తనకు ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి పరిస్థితులను తెలియజేయాలని పలువురు కోరారన్నారు. ఈ విషయాలను పార్టీ అధ్యక్షుడు ఖర్గేతోపాటు అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఆమె వివరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయన్నారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న నాయకులతో మాట్లాడేందుకు కూడా ఆమె ప్రయత్నించడం లేదని, అనేక జిల్లాల్లో సీనియర్‌ నేతలకు తెలియకుండానే కీలక బాధ్యతల నుంచి తప్పించినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, కడప జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు శ్రీరాములు, జిల్లా నాయకులు రుత్తల శ్రీరామమూర్తి, గుత్తుల శ్రీనివాస్‌, మాజీ డీసీసీ ప్రెసిడెంట్‌ అన్నాజీ, దొమ్మేటి రమణరావు, సుజాత, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.


రైళ్ల రీషెడ్యూల్‌

గంటల తరబడి ఆలస్యం

ప్రయాణికుల అవస్థలు

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

రైళ్ల రీ షెడ్యూల్‌ కారణంగా సోమవారం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఒరిజినేటింగ్‌ స్టేషన్ల నుంచి గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరడంతో విశాఖతోపాటు వివిధ స్టేషన్ల నుంచి గమ్యానికి చేరాలనుకున్న ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సోమవారం హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22863), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ వేసవి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు (02841), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు (08583), శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైలు (07426) వంటి ప్రధాన రైళ్లను రీ షెడ్యూల్‌ చేయడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అలాగే ఆదివారం రాత్రి బయలుదేరాల్సిన హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12863), హౌరా-పాండిచ్చేరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12867), హౌరా-చెన్నై సెంట్రల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839), బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864), హౌరా-జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18005) రైళ్లను సోమవారం ఉదయం బయలుదేరే విధంగా రీ షెడ్యూల్‌ చేయడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. రీ షెడ్యూల్‌ చేసినట్టు ముందుగా మెసేజ్‌ ద్వారా రైల్వే శాఖ తెలియజేయడంతో కొందరు ప్రయాణికులు టికెట్‌ రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయగా, మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో గంటల తరబడి నిరీక్షించారు.


ముగ్గురు సీఐల బదిలీ

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ముగ్గురు సీఐలకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వెయింటింగ్‌లో ఉన్న జి.గోవిందరావుకు స్పెషల్‌ బ్రాంచి-3 సీఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్న ఎన్‌.వి.ప్రభాకరరావును గోపాలపట్నం సీఐగా, గోపాలపట్నం సీఐగా పనిచేస్తున్న గొలగాని అప్పారావును మల్కాపురం సీఐగా బదిలీచేశారు.

Updated Date - May 20 , 2025 | 01:26 AM