Share News

అన్నదానంలో చేతివాటం!

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:07 AM

నగరంలోని ప్రధాన ఆలయాల్లో కొందరు అధికారులు ప్రతి దాంట్లోను కమీషన్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా నిత్యాన్నదానం సెక్షన్‌ నుంచి నెలకు కనీసం లక్ష రూపాయలకు తక్కువ లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆ విభాగంలో లెక్కలు మారిపోతున్నాయి. భక్తులకు పెట్టే భోజనంలో రుచి తగ్గిపోతోంది. నాణ్యమైన సరకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్నానికి ఉపయోగించే బియ్యం మారిపోతున్నాయి. సాంబారు పలచగా మారిపోతోంది. ప్రతిరోజు పెట్టాల్సిన స్వీటు కొన్ని రోజులు కనిపించకుండా పోతోంది.

అన్నదానంలో చేతివాటం!

ఆలయాల్లో అధికారుల కక్కుర్తి

నెలవారీ కమీషన్ల డిమాండ్‌

ఆహారంలో తగ్గిపోతున్న నాణ్యత

మారుతున్న లెక్కలు

ప్రసాదాలపైనా ఆ ప్రభావం

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని ప్రధాన ఆలయాల్లో కొందరు అధికారులు ప్రతి దాంట్లోను కమీషన్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా నిత్యాన్నదానం సెక్షన్‌ నుంచి నెలకు కనీసం లక్ష రూపాయలకు తక్కువ లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆ విభాగంలో లెక్కలు మారిపోతున్నాయి. భక్తులకు పెట్టే భోజనంలో రుచి తగ్గిపోతోంది. నాణ్యమైన సరకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్నానికి ఉపయోగించే బియ్యం మారిపోతున్నాయి. సాంబారు పలచగా మారిపోతోంది. ప్రతిరోజు పెట్టాల్సిన స్వీటు కొన్ని రోజులు కనిపించకుండా పోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతి ప్రధాన ఆలయంలో తప్పనిసరిగా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని ఆదేశించింది. దీంతో అన్నదానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నదంటూ కొందరు బడ్జెట్‌ పెంచుకుంటూ పోతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు మాత్రం ఉండడం లేదు. సింహాచలం దేవస్థానంలో రోజుకు సగటున మూడు వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. వారాంతాల్లో ఆ సంఖ్య ఐదు వేలకు చేరుతుంది. అక్కడ కొండపై ఎంతమంది భక్తులు వచ్చారో లెక్క తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అంటే అన్నదాన సత్రానికి వచ్చే వారి దగ్గర బయోమెట్రిక్‌ తీసుకుంటారు. దీనిని బట్టి ఏ రోజు ఎంతమంది వచ్చారో తెలుస్తుంది. నగరంలో అన్నదానం నిర్వహించే ఓ ఆలయంలో ఆ ఏర్పాట్లు లేవు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల మధ్య ఎంత మంది భక్తులు వస్తే అంత మందికి భోజనం కూపన్లు ఇస్తారు. సిబ్బంది చూపించేదే లెక్క. దీనివల్ల భక్తుల సంఖ్యలో తేడాలు చూపించడానికి అవకాశం కలుగుతోంది.

సాధారణంగా ఆలయ ఉన్నతాధికారులు నెలకు ఇంత కావాలని డిమాండ్‌ చేసి తీసుకున్న సందర్భాలు లేవు. ఇటీవల కాలంలోనే ఈ దుష్ట సంస్కృతి మొదలైందని చెబుతున్నారు. ‘మీరు ఏమి చేసుకుంటారో మాకు అనవసరం. నెల అయ్యేసరికి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే’ అని ఒత్తిడి పెట్టడంతో ఆ మొత్తం సమకూర్చడానికి సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. అది ఒక లక్ష రూపాయలతో ఆగడం లేదు. ఆ విభాగంలో పనిచేస్తున్నవారు పంచుకోవడానికి మరికొంత మిగుల్చుకుంటున్నారు. దాంతో అన్నదానంలో నాణ్యత తగ్గిపోతోంది. ఇంత మొత్తం సమకూర్చడం కష్టంగా ఉండడంతో ప్రసాదాలు పులిహోర, లడ్డూల నాణ్యతను కూడా తగ్గించేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ ఆలయంలో ప్రసాదాల రుచి బాగా పడిపోయిందని దాతలే చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై ప్రజా ప్రతినిధులు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. తనిఖీలు కూడా తూతూమంత్రంగానే సాగుతున్నాయి.

ఇంకొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి పూజార్ల ప్లేటులో భక్తులు వేసే దక్షిణలోను వాటాలు కోరుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆలయ ఖర్చులు ఉంటాయంటూ పూజారులు స్వచ్ఛందంగా కొంత అక్కడి మధ్య స్థాయి సిబ్బందికి ఇస్తుంటారు. కానీ ఇటీవల నెలకు రూ.25 వేలు కావాలని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయాలకు వెళ్లి మర్యాదలు పొందే ప్రజా ప్రతినిధులు అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఆకస్మికంగా వెళ్లి భక్తులతో కూర్చొని అప్పుడప్పుడు అన్న ప్రసాదం తింటే...ఇలాంటి అవకతవకలకు చెక్‌ పెట్టొచ్చు.

Updated Date - Aug 20 , 2025 | 01:07 AM