మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఎస్జీటీలనే హెచ్‌ఎంలుగా నియమించాలి
ABN , Publish Date - May 15 , 2025 | 12:01 AM
ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో నంబర్ 19, 20, 21లలో పాఠశాలల పునర్నిర్మాణం పేరుతో తొమ్మిది రకాల పాఠశాలలుగా వాటిని ప్రభుత్వం విభజించిందని యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొంది చినబ్బాయి తెలిపారు.
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చినబ్బాయి
అనకాపల్లి టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో నంబర్ 19, 20, 21లలో పాఠశాలల పునర్నిర్మాణం పేరుతో తొమ్మిది రకాల పాఠశాలలుగా వాటిని ప్రభుత్వం విభజించిందని యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొంది చినబ్బాయి తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్కూళ్లను తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించడం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, ఈ తొమ్మిది రకాల పాఠశాలలకు తెలుగు పేరు పెట్టకపోవడం శోచనీయమని వాపోయారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 గాను, బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో 1:20 గాను, హై స్కూల్స్‌లో విలీనమైన ప్రైమరీ స్కూల్స్‌లో 1:10 గాను నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:20 గా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్‌లను నియమించడం సరికాదన్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్లనే హెచ్‌ఎంలుగా నియమించాలని డిమాండ్ చేశారు.