Share News

సెజ్‌ రోడ్లు ఛిద్రం

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:40 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) రోడ్లు గోతులమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అచ్యుతాపురంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను అచ్యుతాపురం-ఎలమంచిలి రోడ్డులో గల రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌, అచ్యుతాపురం మండలంలో గల సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా మళ్లించారు.

సెజ్‌ రోడ్లు ఛిద్రం
యోకోహామా టైర్ల కర్మాగారం దాటిన తరువాత మలుపు వద్ద రోడ్డు దుస్థితి

అచ్యుతాపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) రోడ్లు గోతులమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అచ్యుతాపురంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను అచ్యుతాపురం-ఎలమంచిలి రోడ్డులో గల రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌, అచ్యుతాపురం మండలంలో గల సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా మళ్లించారు. ఈ రోడ్డు గుండా సెజ్‌ కర్మాగారాలకు అవసరమైన ముడిసరుకు, నిర్మాణ సామగ్రిని తరలించే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే అచ్యుతాపురం అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా గల మార్టూరు జంక్షన్‌ నుంచి మార్టూరు మీదుగా మరికొన్ని వాహనాలను సెజ్‌లో కర్మాగారాలకు పంపుతున్నారు. మార్టూరు మీదుగా వెళ్లే రోడ్డు చాలా ఇరుకు, కానీ సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా వెళ్లే రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది. అయితే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు గోతులమయమైంది. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇవి మరింత పెద్దవిగా తయారయ్యాయి. దీంతో తేలికపాటి వాహనాలు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి తలెత్తింది. అధికారులు స్పందించి ఈ గోతులను పూడ్చాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:40 AM