ఏడు అంబులెన్సులు ప్రారంభం
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:00 PM
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ రూ.కోటి వ్యయంతో వితరణగా ఇచ్చిన ఏడు అంబులెన్సులను ఐటీడీఏ కార్యాలయం వద్ద మంగళవారం కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్లలింగం, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు.

ఎన్‌పీసీఐఎల్ సామాజిక బాధ్యతగా రూ.కోటితో అందజేత
ఏజెన్సీలో కోరుకొండ, ఈదులపాలెం, జి.మాడుగుల, జీకేవీధి, ఉప్ప, ఆర్వీనగర్, రాజేంద్రపాలెం పీహెచ్‌సీలకు కేటాయింపు
పాడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ రూ.కోటి వ్యయంతో వితరణగా ఇచ్చిన ఏడు అంబులెన్సులను ఐటీడీఏ కార్యాలయం వద్ద మంగళవారం కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్లలింగం, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా వితరణగా ఇచ్చిన అంబులెన్సులను అత్యవసర వైద్య సేవలకు వినియోగిస్తున్నామన్నారు. జిల్లాలో డోలీ మోతల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో 370 గ్రామాలకు కనీస రహదారులు లేవని, రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ఆయా పల్లెలకు రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లోని అంబులెన్సులు 15 సంవత్సరాల క్రితం నాటివి కావడంతో మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. ఆస్పత్రుల అంబులెన్సులకు ఐటీడీఏ నుంచి ఆయిల్ సరఫరా చేస్తున్నామని, ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ రెండు అంబులెన్సులను వితరణ చేశారని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాకు 1,650 మొబైల్ టవర్లు మంజూరు కాగా, 1,000 టవర్ల నిర్మాణం పూర్తి చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ పెదబయలు, అరకులోయ, హుకుంపేట మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో గల గోమంగి, రూడకోట, గన్నెల, ఉప్ప తదితర పీహెచ్‌లకు అంబులెన్సులు మంజూరు చేయాలని కోరారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ మాట్లాడుతూ కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ సామాజిక బాధ్యతగా గిరిజన ప్రాంతానికి గొప్ప సహకారం అందించిందన్నారు. పవర్ కార్పొరేషన్ ఇచ్చిన ఏడు అంబులెన్సులను ఏజెన్సీలో కోరుకొండ, ఈదులపాలెం, జి.మాడుగుల, జీకేవీధి, ఉప్ప, ఆర్వీనగర్, రాజేంద్రపాలెం పీహెచ్‌సీలకు కేటాయించామన్నారు. ఆయా అంబులెన్సుల సేవలను అత్యవసర సమయంలో వినియోగించాలని వైద్యులకు జేసీ సూచించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏజెన్సీలో పెద్ద ఎత్తున రహదారులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతోందన్నారు. కొవ్వాడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అసోసియేట్ డైరెక్టర్ కేవీఎస్‌బీవీ ప్రసాద్ మాట్లాడుతూ కొండలు, లోయలు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతోనే రూ.కోటి వ్యయంతో ఏడు అంబులెన్సులను అందించామన్నారు. ఈ జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, డీఐవో డాక్టర్ సాధన, ఐటీడీఏ ఏవో హేమలత, ఎన్ పీసీఐఎల్ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ బి.రవికుమార్, హెచ్‌ఆర్ మేనేజర్ ప్రదీప్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవితేజ చిన్ని, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, లగిశపల్లి సర్పంచ్ పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.