Share News

పోలీస్‌ స్టేషన్లలో సెటిల్‌మెంట్లు!

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:09 AM

జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లు ప్రైవేటు సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్‌ కేసులు, భూవివాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా జిల్లాలో కొందరు ఖాకీలు కాసుల యావలో పడి పోలీస్‌ స్టేషన్లను ప్రైవేటు పంచాయతీ సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పెందుర్తికి చెందిన ఒక బంగారం వ్యాపారి న్యాయం కోసం అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఆ వ్యాపారికి న్యాయం చేయకపోగా పట్టణ ఎస్‌ఐ ఈశ్వరరావు అతని నుంచి రూ.50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుబడడం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోలీస్‌ స్టేషన్లలో సెటిల్‌మెంట్లు!
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ పనిచేసిన అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌

- భూవివాదాలు, కుటుంబ తగాదాల్లో తలదూర్చుతున్న ఖాకీలు

- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఇటీవల పట్టుబడిన ఎస్‌ఐ

- ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే కేసు నమోదు చేయకుండా బేరసారాలు

- పారిశ్రామిక వేత్తలకూ తప్పని ఇబ్బందులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లు ప్రైవేటు సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్‌ కేసులు, భూవివాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా జిల్లాలో కొందరు ఖాకీలు కాసుల యావలో పడి పోలీస్‌ స్టేషన్లను ప్రైవేటు పంచాయతీ సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పెందుర్తికి చెందిన ఒక బంగారం వ్యాపారి న్యాయం కోసం అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఆ వ్యాపారికి న్యాయం చేయకపోగా పట్టణ ఎస్‌ఐ ఈశ్వరరావు అతని నుంచి రూ.50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుబడడం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉండగా, 25 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు లేదా ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కాగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారడం, పలు భారీ పరిశ్రమలు వస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అదే స్థాయిలో సివిల్‌ కేసులు, భూదందాలు, భూ ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భూకబ్జాలు, ఆక్రమణలకు సంబంధించిన వివాదాలన్నీ పోలీస్‌ స్టేషన్లకే వెళుతున్నాయి. దీంతో ఎవరైనా న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వస్తే, కేసు నమోదు చేయకుండా ముందుగా పోలీసులే ప్రైవేటు పంచాయతీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల అనకాపల్లి పట్టణ పరిధిలోని నిదానందొడ్డి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి జాగాలోకి వేరొకరు ప్రవేశిస్తున్నారని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆయన న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. పిసినికాడ గ్రామంలో సర్వే నంబర్‌ 38/1లోని ఒక ప్రైవేటు లేఅవుట్‌కు రోడ్డు విషయంలో తమకు న్యాయం చేయాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఫిర్యాదును పట్టించుకోకపోగా, లేఅవుట్‌ యజమానితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక్క అనకాపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే కాదు జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ పోలీస్‌ డివిజన్‌ల పరిధిలోని దాదాపు అన్ని పోలీస్‌ స్టేషన్లలో రోజూ భూ వివాదాలు, కుటుంబ తగాదాలపై సెటిల్‌మెంట్లు జరుగుతున్నట్టు తెలిసింది.

జనరల్‌ కానిస్టేబుళ్లను నియమించుకుని వసూళ్లు

జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో జనరల్‌ కానిస్టేబుళ్లను నియమించుకొని వారి ద్వారా వ్యాపారులు, రోడ్ల పక్కన దుకాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. అనకాపల్లి, నర్సీపట్నం, రోలుగుంట, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జనరల్‌ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాదారులు, రేషన్‌ బియ్యం వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లను వసూలు చేస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా జాతీయ రహదారిని ఆనుకొని వున్న అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట పోలీస్‌ స్టేషన్లలో రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసుల్లో వచ్చేవారి నుంచి దండిగానే వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలోని జాతీయ రహదారిపై పశువుల తరలింపు లారీల నుంచి బీటు కానిస్టేబుళ్లు దండుకుని మీడియాకు చిక్కిన విషయం తెలిసిందే. పరవాడ డివిజన్‌ పరిధిలో ఒక పోలీస్‌ స్టేషన్‌ వసూళ్ల కేంద్రంగా మారినట్టు తెలిసింది. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఆయా పరిశ్రమల్లో ఎటువంటి వివాదాలు చెలరేగినా, ప్రమాదాలు జరిగినా పోలీసులకు దండిగా డబ్బులు చెల్లించుకోవాలని, లేదంటే కేసులు పేరుతో రకరకాలుగా వేధింపులకు గురికాక తప్పదని కొందరు పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అచ్యుతాపురంలో ఇటీవల అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్ల ముఠా గుట్టురట్టయ్యింది. అయితే రెండేళ్లుగా సైబర్‌ నేరగాళ్ల ముఠా స్థానిక పోలీసులకు భారీగా ముడుపులు చెల్లించినట్టు తెలిసింది. అనకాపల్లి రూరల్‌ పరిధిలో అధికంగా రోడ్డు మెటల్‌ క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఆయా క్వారీల నిర్వాహకులు, రోడ్డు మెటల్‌ తరలించే ట్రాన్స్‌పోర్టు యాజమానులు లారీకి ఇంత అని ప్రతి నెలా సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. ఇప్పటికైనా జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు పోలీస్‌ స్టేషన్లలో ప్రైవేటు పంచాయతీలపై దృష్టి సారించి, అక్రమ వసూళ్లను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 01:09 AM