సచివాలయాలు గాడిన పడాల్సిందే..
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:14 AM
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గాడి తప్పింది. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- చక్కదిద్దితేనే ప్రజలకు మెరుగైన సేవలు
- వైౖసీపీ హయాంలో వ్యవస్థ అస్తవ్యస్తం
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం చర్యలు
- విజన్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గాడి తప్పింది. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు పరిపాలనను చేరువ చేసే లక్ష్యంగా పెట్టుకున్నా అప్పట్లో సచివాలయాల్లో సిబ్బందిపై స్థానిక వైసీపీ నేతల అజమాయిషీ వల్ల వ్యవస్థ క్రమంగా గాడి తప్పింది. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు అనేక చోట్ల సిబ్బంది కొరతతో వెలవెలబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సచివాలయాలను ’విజన్ సెంటర్లు’గా నామకరణ చేసి, జిల్లాలో ప్రస్తుతం సచివాలయాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. మొన్నటి సాధారణ బదిలీలకు ముందు ఇప్పటికే సచివాలయాల రీ గ్రూపింగ్ జరపడం ద్వారా సచివాలయ పరిధిలో 2,500 మంది జనాభా ఉంటే ఆరుగురు సిబ్బంది, 3,500 మంది జనాభాకు ఏడుగురు, 3,500 దాటి ఉంటే 8 మంది సిబ్బంది ఉండేలా అధికారులు ప్రక్షాళన చర్యలు చేపట్టారు. అయితే వివిధ క్యాడర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో రీగ్రూపింగ్ ద్వారా క్లస్టర్లుగా విభజించినా సిబ్బంది కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, ప్రస్తుతం కార్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై ’ఆంధ్రజ్యోతి’ న్యూస్ నెట్‌వర్క్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అరకొర సిబ్బందితో అందని సేవలు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండగా ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలోని 24 మండలాల్లో 522 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయంలోనూ 12 రకాల ఉద్యోగులను నియమించాల్సి ఉంది. ఈ లెక్కన సచివాలయాల్లో 6,264 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా వివిధ కేడర్లకు చెందిన పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అప్పట్లో మండల కేంద్రాల్లో, రోడ్డు పక్కన ఉన్న సచివాలయాల్లో మాత్రమే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం సచివాలయాల్లో వెటర్నరీ అసిస్టెంట్లు 198 మంది, ఏఎన్‌ఎంలు 438 మంది, ఎనర్జీ అసిస్టెంట్లు 143, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 336 మంది, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు 366 మంది, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్లు 294 మంది, పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్-5)లు 587 మంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు 182, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు 47 మంది, విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్లు 91 మంది, విలేజ్ సర్వేయర్లు 406 మంది, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 391 మంది, వీఆర్‌ఓలు 352 మంది...మొత్తం 3,831 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 2,433 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా, మరికొందరు ఇతరత్రా అవకాశాలు రావడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీలు ఉన్న చోట్ల వైసీపీ ప్రభుత్వం నియామకాలు జరపకుండా జాప్యం చేయడంతో సచివాలయాల్లో సిబ్బంది కొరత సమస్య నెలకొంది. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బందే అన్ని పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నేటికీ 165 సచివాలయాలు అద్దె భవనాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లోనే నడుస్తున్నాయి. ఫర్నీచర్ కొరత ఉంది. పలు సచివాలయాల్లో వాష్‌రూమ్‌లు లేక మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్లస్టర్ల విధానంలో ఉద్యోగుల సర్దుబాటు చేసినా సచివాలయాల్లో సిబ్బంది కొరత తీరకపోవడంతో ప్రజలకు సరిగా సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సచివాలయాల్లో ప్రధాన సమస్యలు
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కొరత సమస్య ప్రధానంగా ఉంది. క్లస్టర్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ఒక ఉద్యోగి రెండు, మూడు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలు సచివాలయాల్లో కంప్యూటర్లు మరమ్మతులగు గురై మూలకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సచివాలయాలు ఉన్నందున సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. మండల కేంద్రాలు, సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రజలకు సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. సచివాలయాల సిబ్బందికి తరచూ సంబంధిత శాఖల అధికారులు సమావేశాలు పెడుతుండడంతో మండల కార్యాలయాలకు వెళుతున్నారు. సచివాలయాల్లో అరకొర సిబ్బంది ఉండగా సమావేశాల పేరుతో సిబ్బంది నిత్యం మండల కేంద్రాలకు వెళ్లిపోతుండడంతో ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. కొన్ని చోట్ల నలుగురు సిబ్బందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కార్యాలయంలో ఉంటున్నారు. మిగిలిన సిబ్బంది క్షేత్ర పర్యటనల పేరుతో అందుబాటులో ఉండడం లేదు.