Share News

సచివాలయాల్లో అందని సేవలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:11 AM

మండలంలోని గ్రామ సచివాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పలు సచివాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ఆపై ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. స్టేషనరీ లేక విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు.

సచివాలయాల్లో  అందని సేవలు
పాల్తేరు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల కుర్చీలు

పనిచేయని కంప్యూటర్లు, ప్రింటర్లు,

25 సచివాలయాల్లో 200కి 146 మంది ఉద్యోగులు

25 డిజిటల్‌ అసిస్టెంట్లకు ఉన్నవారు ఏడుగురు

మండలం నుంచి 75 మంది బదిలీకాగా

వచ్చినవారు 55 మంది మాత్రమే

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

పనులు జరక్క ప్రజల ఇబ్బందులు

పాయకరావుపేట, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామ సచివాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పలు సచివాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదు. ఆపై ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. స్టేషనరీ లేక విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు.

గ్రామ సచివాలయాల్లో ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. మండలంలో జనాభా ప్రాతిపదికన 30వేల జనాభా ఉన్న పాయకరావుపేట పట్టణంలో ఐదు సచివాలయాలు.. మిగిలిన 23 పంచాయతీల్లో 20 సచివాలయాలు ఏర్పాటుచేశారు. ఒక్కో సచివాలయానికి 8 నుంచి 11 మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. అయితే సచివాలయ వ్యవస్థ వచ్చి నాలుగేళ్లు కావస్తుండడడంతో కంప్యూటర్లు, ప్రింటర్లు సరిగా పనిచేయడం లేదు. కొన్నిచోట్ల ప్రింటర్లు మరమ్మతులతో మూలకు చేరాయి. అవసరమైన పేపరు, ధ్రువపత్రాల జారీకి ప్రింటెడ్‌ స్టేషనరీ కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు సచివాలయాల ప్రక్షాళన చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులను రేషనలైజేషన్‌ ద్వారా ఒక్కో సచివాలయానికి డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, మహిళా పోలీస్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అసిస్టెంట్లను నియమించింది. అయితే ఇంజనీరింగ్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లను చాలావరకు ఆయా శాఖల అధికారులు తమ శాఖ పనులకు వినియోగిస్తుండడంతో సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. పైగా ఇటీవల నిర్వహించిన బదిలీల్లో మండలం నుంచి 75 మంది వెళ్లగా.. ఇతర మండలాల నుంచి 55 మంది మాత్రమే వచ్చారు. దీంతో మండలంలోని పలు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేక వెలవెలబోతున్నాయి. ప్రతి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ తప్పనిసరిగా ఉండాల్సి ఉండగా.. మండలంలో 25 సచివాలయాలకు ఏడుగురు మాత్రమే ఉన్నారు. మండలంలో పాల్తేరులో ఇద్దరు, పెంటకోటలో ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు. పైగా సచివాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడం సమస్యగా మారింది. దీంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రైతులకు అవసరమైన 1బి, ఇతర ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీనికితోడు పలు సచివాలయాల్లో ప్రింటర్లు పాడై మూలకు చేరగా, పలుచోట్ల ప్రింటెడ్‌ స్టేషనరీ కొరత కారణంగా ధ్రువపత్రాల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సచివాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 01:11 AM