Share News

హెల్త్‌ సెంటర్స్‌లో అందని సేవలు

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:05 AM

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

హెల్త్‌ సెంటర్స్‌లో అందని సేవలు

పట్టణ ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ కరువు

అనేకచోట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది

అనధికారికంగా విధులకు డుమ్మా

ఏడుగురు ఉండాల్సిన చోట్ల ఇద్దరు, ముగ్గురే ఉంటున్న వైనం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విధులకు ఎగనామం పెడుతూ రోగులకు వైద్య సేవలను దూరంచేస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో 66 చోట్ల అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ను ఏర్పాటుచేశారు. ఒక్కో సెంటర్‌కు ఏడుగురు సిబ్బంది (ఒక వైద్యుడు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డీఈవో, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌) ని కేటాయించారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందించాలి. అయితే, అనేక అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల స్టాఫ్‌ నర్సులు, మరికొన్నిచోట్ల ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఫార్మసిస్టులు ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు.

తాజాగా పిఠాపురం కాలనీలో గల సెంటర్‌కు ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలకు వెళ్లగా, వైద్యురాలితోపాటు స్టాఫ్‌ నర్సులు అందుబాటులో లేకపోవడం గుర్తించారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. అయితే, ఈ తరహా పరిస్థితి అనేక అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఉందని చెబుతున్నారు. కొందరు ఉదయం విధులకు హాజరై అటెండెన్స్‌ వేసుకుని వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టిసారిస్తూ బయటకు వెళ్లిపోతు న్నారు. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

రోగుల పాట్లు

అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో 64 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయం ఉంది. రోగులకు 172 రకాల మందులను అందించాల్సి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల మెరుగ్గా సేవలు అందిస్తుంటే, కొన్నిచోట్ల అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావును వివరణ కోరగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించామన్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో సిబ్బంది అందుబాటులో లేకపోతే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు నన్నారు.


వైద్య సేవల్లోనూ కోత!

పెదగంట్యాడ ఆస్పత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ మాత్రమే వైద్యం

రాత్రిపూట క్లోజ్‌

సోమవారం నుంచి అమలు

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం నిర్ణయం

ఉద్యోగులు, కార్మికుల ఆందోళన

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

ఉద్యోగులు, కార్మికులకు కొన్ని దశాబ్దాలుగా కల్పిస్తున్న సౌకర్యాలను స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూవస్తోంది. గతంలో క్వార్టర్స్‌లో ఉండే వారికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ ధర...యూనిట్‌కు ఎనిమిది రూపాయలు చొప్పున వసూలుచేస్తున్నారు. ఇంటి అద్దె అలవెన్స్‌ తీసేశారు. కాంట్రాక్టు వర్కర్లకు నెలకు రూ.2 వేలు చొప్పున ప్రత్యేక అలవెన్స్‌ ఇచ్చేవారు. అది రద్దు చేశారు. విశాఖ విమల విద్యాలయం మూసేశారు. కేంద్రీయ విద్యాలయంలో ప్లస్‌ వన్‌ ప్రవేశాలు నిలిపివేశారు. స్టీల్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి రిఫరల్‌ కేసులు ఆపేశారు. ఇప్పుడు తాజాగా పెదగంట్యాడలోని హెల్త్‌ సెంటర్‌ సేవలు కుదించేశారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు, ఉద్యోగులకు ఉపయోగపడేలా దీనిని నలుగురు వైద్యులతో చాలాకాలంగా నడుపుతున్నారు. ముగ్గురు వైద్యులు పగటిపూట, రాత్రివేళ ఇంకో డాక్టర్‌ ఉండేవారు. వీరికి సాయంగా నర్సులు, కాంపౌండర్‌, పారిశుధ్యం సిబ్బంది ఉండేవారు. నాలుగు రోజుల క్రితం యాజమాన్యం ఒక నోటీసు జారీచేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి కేవలం జనరల్‌ షిఫ్ట్‌లోనే ఈ హెల్త్‌ సెంటర్‌ పనిచేస్తుందని ప్రకటించింది. అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఆ తరువాత మూసేస్తారు. రాత్రిపూట వైద్యం అందదు. ప్రస్తుతం ఈ కేంద్రానికి ఒకే ఒక వైద్యుడు ఉన్నారు. ఆయనతోనే నడుపుతున్నారు. ఇంతకుముందు రోజుకు 150 నుంచి 200 మంది ఇక్కడికి వైద్యం కోసం వచ్చేవారు. వైద్యులు సరిపడా లేకపోవడంతో రోగులు కూడా తగ్గిపోయారు. ప్రస్తుతం జ్వరానికి మందులు తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. గాయాలతో వచ్చిన వారిని కూడా ప్రధాన ఆస్పత్రికి పంపించేస్తున్నారు. క్రమంగా దీనిని మూసేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై పెదగంట్యాడ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఎప్పటిలాగే రాత్రిపూట కూడా నడపాలని కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 01:05 AM