సచివాలయాల్లో సర్వర్ డౌన్
ABN , Publish Date - May 18 , 2025 | 12:47 AM
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు, పాత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియకు సర్వర్ సమస్య ప్రతిబంధకంగా తయారైంది. సాంకేతిక సమస్యలతో సర్వర్ తరచూ మొరాయిస్తుండడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి వుండాల్సి వస్తున్నది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుచేసుకుంటున్న వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మొరాయిస్తున్న పౌరసరఫరాల వెబ్‌సైట్
‘రేషన్ కార్డుల’ దరఖాస్తుల ఆన్‌లైన్‌కు తీవ్రజాప్యం
గంటల తరబడి నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు, పాత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియకు సర్వర్ సమస్య ప్రతిబంధకంగా తయారైంది. సాంకేతిక సమస్యలతో సర్వర్ తరచూ మొరాయిస్తుండడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి వుండాల్సి వస్తున్నది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుచేసుకుంటున్న వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, పేర్లలో తప్పులు సరిచేసుకోవడం, కార్డుల విభజన, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామాల మార్పు వంటి వాటికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందు కోసం సమీపంలో వున్న గ్రామ/ వార్డు సచివాలయాలకు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా పెళ్లియిన వారు, ఇంతవరకు రేషన్ కార్డులు లేని కుటుంబాలు, పిల్లల పేర్లు ఇంతవరకు రేషన్ కార్డులో చేర్చని కుటుంబాలు దరఖాస్తు చేయడానికి సచివాలయాలకు క్యూ కడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు.
మొరాయిస్తు సర్వర్లు
జిల్లాలో 522 గ్రామ/ వార్డు సచివాలయాలు వున్నాయి. ఇక్కడ వుండే సిబ్బంది, ప్రజల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ జిల్లాలో సగానికిపైగా కార్యాలయాల్లో పౌరసరఫరాల శాఖకు చెందిన వెబ్‌సైట్ కనెక్ట్ కావడం లేదు. నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, మాడుగుల, మునగపాక మండలాల్లోని శివారు గ్రామాల్లో ఈ సమస్య అధికంగా వుండి. సర్వర్ తరచూ డౌన్ అవుతుండడంతో దరఖాస్తుల అప్‌లోడ్‌లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి గంటపాటు మాత్రమే వెబ్‌సైట్ పనిచేస్తున్నది. తరువాత మొరాయిస్తున్నది. దరఖాస్తుదారుని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండగానే వెబ్‌పేజీ ఫ్రీజ్ అవుతున్నది. దీంతో వివరాలను మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వస్తున్నది. ఒక దరఖాస్తు అప్‌లోడ్ కావడానికి రెండు, మూడు గంటల సమయం పడుతున్నది. దీంతో కొన్ని సచివాలయాల సిబ్బంది రేషన్ దరఖాస్తులను మాన్యువల్‌గా స్వీకరిస్తున్నారు. సర్వర్ పనిచేసినప్పుడుఅప్‌లోడ్ చేసి, దరఖాస్తుదారులను మరోసారి పిలిపించుకుని ఈ-కేవైసీ చేస్తున్నారు.
మేన్యువల్‌గా దరఖాస్తుల స్వీకరణ
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూర్తి
కొన్ని సచివాలయాల్లో సాంకేతిక సమస్యల కారణంగా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను అప్‌లోడ్ చేసే విషయంలో ఇబ్బందులున్న మాట వాస్తమే. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటువంటిచోట్ల మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయ్యాక అర్జీదారులను కార్యాలయాలకు పిలిచి ఈ-కేవైసీ పూర్తిచేయాలని సిబ్బందికి సూచించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. రేషన్ కార్డుల్లో తప్పుల సవరణ నిరంతరం సాగుతుంది. దీనికి గడువు అంటూ లేదు.