ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:23 PM
చింతపల్లి-కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రింతాడ మాలీవీధి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో కూరగాయలను లోడ్ చేస్తున్న గిరిజన రైతులను ఓ జీపు బలంగా ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఎనిమిది మంది గిరిజనులు స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రింతాడ హైవేపై కూరగాయలను ఆటోలో లోడ్ చేస్తున్న రైతులను ఢీకొన్న జీపు
ఒకరి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు
ఎనిమిది మందికి స్వల్ప గాయాలు
గూడెంకొత్తవీధి/చింతపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి-కృష్ణాదేవిపేట జాతీయ రహదారి రింతాడ మాలీవీధి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో కూరగాయలను లోడ్ చేస్తున్న గిరిజన రైతులను ఓ జీపు బలంగా ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఎనిమిది మంది గిరిజనులు స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో రింతాడ మాలీవీధి వద్ద రహదారికి ఒక వైపున ఆటోను పార్కు చేసి కూరగాయలను చింతపల్లి మార్కెట్‌కు తరలించేందుకు గిరిజన రైతులు లోడ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆర్‌వీనగర్‌కు చెందిన ఓ పాఠశాల జీపు వేగంగా వచ్చి రహదారి పక్కన కూరగాయలను లోడ్ చేస్తున్న గిరిజనులు, ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటోకి ముందు భాగంలో ఉన్న రింతాడ మాలివీధికి చెందిన కిల్లో తులసి(68), వంతల లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ఆటో వెనుక భాగంలో ఉన్న రింతాడ గ్రామానికి చెందిన కిముడు జయంతి, గోవర్ధన్, వంతల గణపతి, వంతల పద్మ, వంతల మోహన్‌రావు, చిత్తమామిడి గ్రామానికి చెందిన గుంట ముకుంద, పాంగి కొమ్ములు, కిల్లో బుజ్జిబాబు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కిల్లో తులసి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వంతల లక్ష్మికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో కేజీహెచ్‌కి తరలించారు. స్వల్పగాయాలతో బాధపడుతున్న క్షతగాత్రులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జీకేవీధి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.