Share News

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ‘కిల్లాడ’కు రాష్ట్రపతి సేవా పతకం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:37 AM

మండలంలోని పాములవాకకు చెందిన ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కిల్లాడ సత్యనారాయణ రాష్ట్రపతి సేవా మెడల్‌కు ఎంపికయ్యారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ‘కిల్లాడ’కు రాష్ట్రపతి సేవా పతకం

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ

  • ప్రస్తుతం యూపీలో అదనపు డీజీపీ హోదాలో పనిచేస్తున్న సత్యనారాయణ

కోటవురట్ల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి)

మండలంలోని పాములవాకకు చెందిన ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కిల్లాడ సత్యనారాయణ రాష్ట్రపతి సేవా మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సత్యనారాయణ 1997లో సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అంతకుముందు నర్సీపట్నం మండలం బలిఘట్టం పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఐపీఎస్‌ శిక్షణ అనంతరం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించారు. తొలుత ఆగ్రా ఏఎస్పీగా పోస్టింగ్‌ పొందారు. ఒకవైపు పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కెరీర్‌గైడెన్స్‌ శిక్షణ ఇచ్చేవారు. చంబల్‌లోయలో బందిపోట్లను కట్టడి చేయడం, వారాణసి డీఐజీగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేశారు. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు (2014-19) ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చి అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. నర్సీపట్నంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ ఇప్పించారు. పాములవాక ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. నర్సీపట్నం గ్రంథాలయానికి ఏటా రూ.50-60 వేల విలువ చేసే ఉద్యోగ పోటీపరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ అదనపు డీజీపీగా సేవలు అందిస్తున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:37 AM