Share News

జి.భీమవరంలో సీనియర్‌ సిటిజన్‌ హోం

ABN , Publish Date - May 03 , 2025 | 12:50 AM

మండలంలోని జి.భీమవరంలో ‘పావని సొసైటీ ఫర్‌ ది మల్టిపుల్‌ హ్యాండీక్యాప్డ్‌ అండ్‌ స్పాస్టిక్స్‌’ అనే సంస్థ ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్‌ హోంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఏజింగ్‌ విత్‌ డిగ్నిటీ’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె, దేశ వ్యాప్తంగా పలు సీనియర్‌ సిటిజన్స్‌ హోంలను వర్చువల్‌గా ప్రారంభించారు.

జి.భీమవరంలో సీనియర్‌ సిటిజన్‌ హోం
వర్చువల్‌గా వయోవృద్ధాశ్రమాలను ప్రారంభిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కశింకోట, మే 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జి.భీమవరంలో ‘పావని సొసైటీ ఫర్‌ ది మల్టిపుల్‌ హ్యాండీక్యాప్డ్‌ అండ్‌ స్పాస్టిక్స్‌’ అనే సంస్థ ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్‌ హోంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఏజింగ్‌ విత్‌ డిగ్నిటీ’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె, దేశ వ్యాప్తంగా పలు సీనియర్‌ సిటిజన్స్‌ హోంలను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో జి.భీమవరంలో ఏర్పాటు చేసిన సీనియర్‌ సిటిజన్‌ హోం కూడా వుంది. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని, వయోజనులను భవిష్యత్తుకు మార్గదర్శకులుగా భావించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి అన్నారు. జి.భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, పదేళ్ల తరువాత రాష్ర్టానికి కొత్తగా 15 సీనియర్‌ సిటిజన్‌ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. వయోవృద్ధులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, వీటి వల్ల ఆయా పథకాలను వినియోగించుకోవడం సులభతరం అవుతుందని అన్నారు. కార్డులు పొందాల్సిన వారు గ్రామ/వార్డు సచివాలయాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, లేదా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు ఎ.రవిప్రకాశ్‌రెడ్డి, ఏడీ బి.ఆశయ్య, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ‘పావని సొసైటీ’ నిర్వాహకురాలు డి.రజని, కార్యదర్శి ఎం. సత్యవాణి, ఐసీడీఎస్‌ పీడీ కె.అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:50 AM