Share News

విశాఖకు సెమీ రింగ్‌ రోడ్డు

ABN , Publish Date - May 14 , 2025 | 12:55 AM

రాష్ట్ర రాజధాని అమరావతికి రింగ్‌ రోడ్లు నిర్మిస్తున్నట్టే ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కనీసం ఓ రింగ్‌ రోడ్డు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

విశాఖకు సెమీ రింగ్‌ రోడ్డు

  • రాంబిల్లి నుంచి తాళ్లపాలెం, కొత్తవలస, విజయనగరం మీదుగా భోగాపురం వరకూ

  • నిర్మాణానికి ప్రతిపాదన

  • నివేదిక తయారీకి కన్సల్టెంట్‌ నియామకం కోసం వీఎంఆర్‌డీఏ ప్రకటన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రాజధాని అమరావతికి రింగ్‌ రోడ్లు నిర్మిస్తున్నట్టే ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కనీసం ఓ రింగ్‌ రోడ్డు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నగరానికి ఓ వైపు సముద్రం, మూడు వైపులా కొండలు ఉండడం వల్ల అమరావతిలా పూర్తి రింగ్‌ రోడ్డు నిర్మించే అవకాశం లేదు. అందుకని సెమీ రింగ్‌ రోడ్డు అయినా ప్లాన్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలోనే జిల్లా అధికారులకు ఆదేశించారు. దీనిపై విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం నగరం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతోంది. విశాఖ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు కోస్టల్‌ కారిడార్‌ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అంటే సగం రింగ్‌ రోడ్డుకు ప్లానింగ్‌ పూర్తయినట్టుగానే జిల్లా అధికారులు చెబుతున్నారు. మిగిలిన సగం రింగ్‌ రోడ్డును అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద ప్రారంభించి తాళ్లపాలెం, అనకాపల్లి (రాష్ట్ర జాతీయ రహదారిని తాకకుండా), కొత్తవలస మీదుగా విజయనగరం నుంచి భోగాపురం కలుపుతూ ఏర్పాటుచేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇది అర్ధ చంద్రాకారంలో వస్తుంది. అనకాపల్లి, విశాఖపట్నాలను తాకకుండా వాటి పైనుంచి విజయనగరం మీదుగా భోగాపురం వరకు తీసుకువెళ్లాలని ఆలోచన. దీనికి అవసరమైన అలైన్‌మెంట్‌, రింగ్‌ రోడ్డు పొడవు, వెడల్పు, అవసరమైన భూములు, వంతెనల నిర్మాణం వంటి అంశాలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారుచేయడానికి వీఎంఆర్‌డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. మూడు నెలల సమయం ఇచ్చి నివేదిక కోరతామని, ఆపై దానిని ప్రభుత్వానికి సమర్పించి ఆ తదుపరి చర్యలు చేపడతామని వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

85 కి.మీ., ఆరు వరుసలు

వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన సెమీ రింగ్‌ రోడ్డు (ఎస్‌ఆర్‌ఆర్‌) అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకు వస్తుందని, ఆరు వరుసల్లో ఉంటుందని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు తెలిపారు.

Updated Date - May 14 , 2025 | 12:55 AM