Share News

వీడీవీకేలతో గిరి మహిళలకు స్వయం ఉపాధి

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:24 AM

ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రాల (వీడీవీకే)ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు.

వీడీవీకేలతో గిరి మహిళలకు స్వయం ఉపాధి
మినుములూరులోని హాట్‌ బజార్‌లో అడ్డాకుల కుట్టును పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

ఏజెన్సీ వ్యాప్తంగా 30 హాట్‌ బజార్లు ప్రారంభం

పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రాల (వీడీవీకే)ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. మండలంలో మినుములూరు వన్‌ధన్‌ వికాస కేంద్రానికి సంబంధించిన హాట్‌ బజార్‌ను సోమవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను ప్రోసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించాలనే లక్ష్యంతోనే వీడీవీకేలను ఏర్పాటు చేశారన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గిరిజన మహిళలు స్వయం ఉపాధి పొందుతారన్నారు. జీసీసీ ఆర్థిక సాయంతో నిర్మించిన హాట్‌ బజార్లలో ప్రోసెసింగ్‌కు సంబంధించిన యంత్ర పరికాలను ఏర్పాటు చేసుకుని, ప్రతి హాట్‌ బజార్‌ ఒక ప్రోసెసింగ్‌ యూనిట్‌గా అభివృద్ధి చెందాలని, అందుకు లబ్ధిదారులైన మహిళలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. వీడీవీకేలు, హాట్‌ బజార్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని, వాటిని సక్రమంగా నిర్వహించి మహిళలు ఆర్థిక లబ్ధి పొందాలన్నారు. ఈ సందర్భంగా విస్తర్లు తయారీకి వినియోగించే అడ్డాకులను మిషన్‌పై కుట్టడాన్ని ఐటీడీఏ పీవో శ్రీపూజ స్వయంగా పరిశీలించారు. మహిళలు పొందిన ఆయా శిక్షణలపై ఆమె ఆరా తీశారు.

30 హాట్‌ బజార్లు ప్రారంభం

స్థానిక ఐటీడీఏ పరిధిలో నిర్మాణం పూర్తయిన 30 హాట్‌ బజార్లను సోమవారం ఐటీడీఏ పీవో శ్రీపూజ, వివిధ స్థాయిల్లో అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పాడేరు మండలంలో 3, అరకులోయలో 4, అనంతగిరిలో 1, పెదబయలులో 4, ముంచంగిపుట్టులో 3, జి.మాడుగులలో 3, జీకేవీధిలో 5, చింతపల్లిలో 3, డుంబ్రిగుడ మండలంలో 4 హాట్‌ బజార్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీ ఆర్‌డీఏ పీడీ వి.మురళి, డీపీఎంలు, ఎంపీఎంలు, సీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, స్వయం సహాయ సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:24 AM