Share News

సీతమ్మధార సబ్‌ట్రెజరీ విభజనకు మోకాలడ్డు

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:24 AM

సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ ట్రెజరీని విభజించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకాకుండా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 వేల మంది పింఛన్‌దారులు ఉన్న సీతమ్మధార కార్యాలయాన్ని విభజన చేస్తే ప్రతి నెలా వచ్చే మామూళ్లు తగ్గిపోతాయనే కారణంగానే 2018 నుంచి ఇప్పటివరకూ ఉద్యోగులు/సంఘాలు సహకరించడం లేదని విమర్శలు ఉన్నాయి.

సీతమ్మధార సబ్‌ట్రెజరీ  విభజనకు మోకాలడ్డు

విభజించి విశాలాక్షి నగర్‌, గాజువాకల్లో

కొత్తగా కార్యాలయాలు ఏర్పాటుచేయాలని

2018లో ప్రభుత్వం ఆదేశాలు

అప్పటినుంచి అమలుపై దోబూచులాట

తమకు వచ్చే మామూళ్లు తగ్గిపోతాయని

కొంతమంది అధికారులు, ఉద్యోగులే అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు

కుంభకోణం వెలుగుచూసినా మారని సిబ్బంది తీరు

ఎరియర్స్‌ మంజూరుకు భారీగా సొమ్ములు వసూలు

విశాఖపట్నం/సీతంపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):

సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ ట్రెజరీని విభజించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకాకుండా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 వేల మంది పింఛన్‌దారులు ఉన్న సీతమ్మధార కార్యాలయాన్ని విభజన చేస్తే ప్రతి నెలా వచ్చే మామూళ్లు తగ్గిపోతాయనే కారణంగానే 2018 నుంచి ఇప్పటివరకూ ఉద్యోగులు/సంఘాలు సహకరించడం లేదని విమర్శలు ఉన్నాయి.

సబ్‌ ట్రెజరీలో 2011 నుంచి 2017 మధ్య రూ.కోట్ల కుంభకోణం జరిగింది. ఈ నేపథ్యంలో సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ట్రెజరీని విభజించి విశాలాక్షి నగర్‌, గాజువాకల్లో కొత్తగా సబ్‌ట్రెజరీలు ఏర్పాటుచేయాలని 2018లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనికి అనుగుణంగా విశాలాక్షి నగర్‌లో ప్రైవేటు భవనం అద్దెకు తీసుకుని అన్నిరకాల వసతులు సమకూర్చారు. అయితే కార్యాలయాన్ని విభజిస్తే మామ్మూళ్లు తగ్గిపోతాయనే ఉద్దేశంతో అప్పట్లో కొందరు అధికారులు, ఖజానా ఉద్యోగుల సంఘంలో కొందరు నేతలు కొత్త కార్యాలయాలు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత కొత్త కార్యాలయాలు ఊసేలేదు. గతంలో వెలుగుచూసిన కుంభకోణంలో దోషులపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డివిజనల్‌ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పింఛన్‌దారులకు సంబంధించి ఎరియర్స్‌ (బకాయిలు) మంజూరుకు కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పింఛన్‌దారులకు చెందిన పింఛన్‌ పేమెంట్స్‌ ఆర్డర్ల (పీపీవో)ను కొందరు ఉద్యోగులు తమ వద్దే ఉంచుకుని బేరసారాలు సాగిస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే ఎరియర్స్‌ డ్రా చేయని పింఛన్‌దారుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను సంప్రతిస్తుంటారని, అధ్యాపకులు/ఆచార్యులకు సంబంధించి వేతన సవరణ బకాయిలు మంజూరుచేసేందుకు భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీతమ్మధారలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఒక సీనియర్‌ ఉద్యోగిని బదిలీ చేయకపోవడానికి సొమ్ములు చేతులు మారడమే కారణమంటారు.

ప్రస్తుతం సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ట్రెజరీలో సహాయ ఖజానాధికారి, ఇద్దరు ఉప ఖజానాధికారులు, ఆరుగురు సీనియర్‌, ఇద్దరు జూనియర్‌ అకౌంటెంట్లు, షరాఫ్‌ (రికార్డు అసిస్టెంట్‌), మరికొందరు అటెండర్లు ఉన్నారు. ప్రతినెలా 20 వేల మందికి పింఛన్లు బట్వాడా చేయాల్సి ఉండడంతో ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కనీసం పది మంది సీనియర్‌, ఆరుగురు జూనియర్‌ అకౌంటెంట్లు ఉండాలి. సిబ్బంది కొరత వల్ల తప్పులు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నా అదనపు సిబ్బందిని నియమించడం లేదు. ఏదేమైనా సీతమ్మధార సబ్‌ట్రెజరీపై ప్రభుత్వం దృష్టిసారించాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 01:24 AM