విత్తన గిడ్డంగి రెడీ
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:33 AM
గత వైసీపీ ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన గంధవరంలోని విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో పూర్తయింది. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి జిల్లా రైతాంగానికి అవసరమైన విత్తనాలు సరఫరా కానున్నాయి.
త్వరలోనే ప్రారంభం
రైతులకు అందుబాటులోకి రానున్న సేవలు
గత వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం
నాలుగేళ్లపాటు పునాదులకే పరిమితం
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు వేగవంతం
ఏడాదిన్నర కాలంలోనే నిర్మాణం పూర్తి
చోడవరం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన గంధవరంలోని విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో పూర్తయింది. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి జిల్లా రైతాంగానికి అవసరమైన విత్తనాలు సరఫరా కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గంధవరంలో విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు 5 ఎకరాల స్థలం కేటాయించింది. అయితే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రాగా, 2020 జూలై నెలలో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఈ కేంద్రం నిర్మాణానికి ఆర్భాటంగా శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. తరువాత పునాదుల స్థాయిలోనే నిలిచిపోయినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు పర్యవేక్షణలో నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. ఎట్టకేలకు ఈ గిడ్డంగిని పూర్తి చేశారు. ఈ కేంద్రం ప్రారంభమైన తరువాత విజయనగరం వెళ్లనవసరం లేకుండానే అనకాపల్లి జిల్లాతో పాటు అల్లూరి, విశాఖ జిల్లాలకు సైతం గంధవరం నుంచే విత్తనాలు సరఫరా కానున్నాయి. ఉమ్మడి జిల్లా వాతావరణానికి అనుకూలమైన వరి విత్తనాలను ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేసి, ఈ కేంద్రం ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నారు.
అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభం
- కేపీ నాగసాయిబాబు. జిల్లా మేనేజర్, రాష్ట్ర విత్తనాభివృదిఽ్ధ సంస్థ
విత్తన గిడ్డంగి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గిడ్డంగిని ఆ శాఖ అధికారులు మా సంస్థకు అప్పగించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలలో పూర్తికానుంది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన తరువాత కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ గిడ్డంగి ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. పనులన్నీ పూర్తయినందున ఇక ప్రారంభోత్సవమే మిగిలింది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది.