Share News

ఏవోబీలో భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:32 AM

సీపీఐ మావోయిస్టుల ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) వారోత్సవాలు ఈ నెల 2 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఏవోబీలో భద్రత కట్టుదిట్టం
సీలేరులో సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు బలగాలు

నేటి నుంచి మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

సీలేరు మీదుగా తిరిగే ఆర్టీసీ నైట్‌ సర్వీసులు రద్దు

సీలేరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీపీఐ మావోయిస్టుల ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) వారోత్సవాలు ఈ నెల 2 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాల హెచ్చరికతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రతీ ఏటా డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు మావోయిస్టులు పీఎల్‌జీఏ పేరిట వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులకు నివాళులర్పించడం, తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా మారేడుమిల్లి ఎదురు కాల్పుల సంఘటనలో మావోయిస్టు అగ్ర నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజేతో సహా 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సరిహద్దులోని సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఎస్‌ఐ యాసిన్‌ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

నేటి నుంచి 8 వరకు ఆర్టీసీ నైట్‌ సర్వీసులు రద్దు

మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విశాఖపట్నం డిపో నుంచి సీలేరు మీదుగా నడిపే విశాఖపట్నం- సీలేరు నైట్‌ హాల్ట్‌, విశాఖపట్నం- భద్రాచలం, అలాగే భద్రాచలం- విశాఖపట్నం నైట్‌ సర్వీసులను రద్దు చేసినట్టు విశాఖ డిపో డీఎం మాధురి తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నైట్‌ సర్వీసులను రద్దు చేశామని పేర్కొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:32 AM