ప్రైవేటు హాస్టళ్లలో భద్రత ప్రశ్నార్థకం
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:20 AM
నగరంలో ఇష్టానుసారంగా హాస్టళ్లు ఏర్పాటుచేస్తున్న ప్రైవేటు/కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు వాటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నగర శివారునున్న ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్ నాలుగో అంతస్థులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సంస్థకు రెండుచోట్ల జూనియర్ కళాశాలలు ఉండగా, వాటిలో చదువుకుంటున్న సుమారు 60 మంది హాస్టల్‌లో ఉంటున్నారు.
అనుమతులు లేకుండానే
నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలు
ఈ ఏడాది కొత్తగా మరిన్ని ఏర్పాటు
దృష్టి సారించని ఉన్నత విద్యా శాఖ అధికారులు
తూతూమంత్రంగా తనిఖీలు
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఇష్టానుసారంగా హాస్టళ్లు ఏర్పాటుచేస్తున్న ప్రైవేటు/కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు వాటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నగర శివారునున్న ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్ నాలుగో అంతస్థులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సంస్థకు రెండుచోట్ల జూనియర్ కళాశాలలు ఉండగా, వాటిలో చదువుకుంటున్న సుమారు 60 మంది హాస్టల్‌లో ఉంటున్నారు. సాయంత్రం స్నాక్స్ కోసం వారంతా కిందకు దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన నగరంలోని ప్రైవేటు కళాశాలలు, హాస్టళ్ల నిర్వహణపై సందేహాలు రేకెత్తిస్తోంది.
ఇంటర్ బోర్డు సమాచారం మేరకు నగరంలో సుమారు 40 జూనియర్ కళాశాలలకు అనుబంధంగా హాస్టళ్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో పది ఏర్పాటయ్యాయి. ఉత్తరాది, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సంస్థలు నగరంలో జూనియర్ కళాశాలలు నెలకొల్పాయి. దీంతో వాటికి అనుబంధంగా హాస్టళ్లు వెలిశాయి. జూనియర్ కళాశాలల పరిధిలో హాస్టళ్ల నిర్వహణకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికీ కొంతమంది స్థానిక సంస్థల నుంచి తూతూమంత్రంగా సర్టిఫికెట్ తెచుకుని హాస్టళ్లు ఏర్పాటుచేస్తున్నారు. మరికొందరు ఈ సర్టిఫికెట్లు లేకుండానే హాస్టళ్లు నడుపుతున్నారు. అగ్నిమాపక, విద్యుత్ సంస్థల నుంచి కూడా అనుమతులు పొందడం లేదు.
ఇష్టారాజ్యంగా నిర్వహణ
ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల విద్యార్థులు వస్తుండడంతో నగరంలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు పెరిగాయి. వాటిలో చాలావరకూ హాస్టళ్లు నడుపుతున్నాయి. కొద్ది సంస్థలు మినహా మిగిలిన యజమాన్యాలు గాలికి వదిలేశాయి. వాటిపై దృష్టి సారించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు తూతూమంత్రంగా తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. ఇంటర్ బోర్డులో ఆర్‌ఐవో, సూపరింటెండెంట్, ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారికి నగరంలోని అన్ని కళాశాలలు, హాస్టళ్లు తనిఖీ చేయడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో కమిటీలను నియమించి తనిఖీల బాధ్యతను అప్పగిస్తుంటారు. ఈ కమిటీల్లో ఉన్న అధ్యాపకులను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. దీంతో అన్నీ సక్రమంగానే ఉన్నాయని సర్టిఫికెట్ జారీ చేసేస్తున్నారు.
గత ఏడాది వాల్తేర్‌లోని ఓ కళాశాల హాస్టల్‌లో ఆహారం కలుషితమై పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నగరంలోని హాస్టళ్ల పనితీరుపై నివేదిక కోరుతూ కలెక్టర్ కమిటీలు వేశారు. అయితే ఆ కమిటీలు ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిధిలోని హాస్టళ్ల పనితీరు భేషుగ్గా ఉందని తేల్చాయి. పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే సూచించాయి. ఈ కమిటీలోని అధ్యాపకులకు భారీగా ముడుపులు అందడంతోనే ఇలాంటి నివేదికలు ఇచ్చారనే ఆరోపణలు వినిపించాయి. ఇటీవల ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఇంటర్‌బోర్డు అధికారులు భద్రత, అనుమతులు, నిర్వహణపై పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.