కార్తీక పౌర్ణమికి భద్రతా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:24 PM
కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని దేవాలయాలు, స్నానఘట్టాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని దేవాలయాలు, స్నానఘట్టాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, దేవదాయ, పోలీసు, వైద్య ఆరోగ్య, మండల పరిషత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, మంచినీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. సముద్రం, నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేచోట గజఈతగాళ్లను అందుబాటులో వుంచాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తగిన మరుగు సదుపాయం కల్పించాలని చెప్పారు. ఇటీవల కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన దృష్ట్యా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఆలయాల వివరాలను తహశీల్దార్లు, ఎండీవోలు తీసుకొని వారితో సమావేశం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాంబిల్లి మండలం పంచదార్ల, కశింకోట మండలం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ, దేవదాయ శాఖ ఆధీనంలోని ఆలయాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం పోలీసు సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, దేవదాయ శాఖ అధికారి సుధారాణి, ఆర్డీవోలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.