రంగురాళ్ల క్వారీ పరిసరాల్లో 163 సెక్షన్ అమలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:31 PM
మండలంలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఆ ప్రాంతాల్లో ప్రజల సంచారాన్ని పూర్తిగా నిషేధించామని తహశీల్దార్ అన్నాజీ రావు తెలిపారు.
ఎవరైనా సంచరిస్తే కఠిన చర్యలు
ప్రజలు అక్కడికి వెళ్లకుండా దండోరా వేయించాలి
వీఆర్వోలకు తహశీల్దార్ అన్నాజీరావు ఆదేశం
గూడెంక్తొతవీధి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఆ ప్రాంతాల్లో ప్రజల సంచారాన్ని పూర్తిగా నిషేధించామని తహశీల్దార్ అన్నాజీ రావు తెలిపారు. సోమవారం వీఆర్వోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ రంగురాళ్ల క్వారీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ పరిసర గ్రామాలైన దొడ్డికొండ, తీములబంద, సంకాడ, అసరాడ, రింతాడ, సిగినాపల్లి, గండెంపల్లి, నల్లబెల్లి, ఎస్.కొత్తూరు, కడుగుల, పులుసుమామిడి, గుర్రాళ్లగొంది ప్రజలు రంగురాళ్ల క్వారీ వద్దకు వెళ్లరాదన్నారు. క్వారీ వద్దకు వెళ్లరాదని సంకాడ, రింతాడ, దామనాపల్లి వీఆర్వోలు దండోరా వేయించి విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా కొండపైకి వెళ్లి తవ్వకాలు నిర్వహిస్తే చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.