సచివాలయాలు వెలవెల
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:21 AM
మండలంలోని గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. ఒక్కో సచివాలయంలో 11 మంది చొప్పున 17 సచివాలయాల్లో 187 మంది వుండాలి. కానీ ప్రస్తుతం 76 మంది (40 శాతం) మాత్రమే వున్నారు. ఒక్క సచివాలయంలో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేరు. మొత్తం మీద 111 పోస్టులు ఖాళీగా వున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక సహాయకుల పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీలు వుండడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందడంలేదు.
నాతవరం మండలంలో 60 శాతం పోస్టులు ఖాళీ
మొత్తం సచివాలయాలు-17
ఒక్కో ఆఫీస్‌లో 11 మంది చొప్పున 187 మంది అవసరం
ప్రస్తుతం ఉన్నది 76 మంది మాత్రమే.. ఖాళీలు-111
జూన్‌లో ఇక్కడి నుంచి 48 మంది బదిలీ
వేరే మండలాల నుంచి 36 మంది మాత్రమే రాక
వివిధ రకాల సేవల్లో తీవ్రజాప్యం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నాతవరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. ఒక్కో సచివాలయంలో 11 మంది చొప్పున 17 సచివాలయాల్లో 187 మంది వుండాలి. కానీ ప్రస్తుతం 76 మంది (40 శాతం) మాత్రమే వున్నారు. ఒక్క సచివాలయంలో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేరు. మొత్తం మీద 111 పోస్టులు ఖాళీగా వున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక సహాయకుల పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీలు వుండడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందడంలేదు.
డిజిటల్ అసిస్టెంట్స్, వేల్ఫేర్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో బదిలీలు జరగడానికి ముందు మొత్తం 86 మంది ఉద్యోగులు వుండేవారు. ఇక్కడి నుంచి 48 మంది ఇతర మండలాలకు బదిలీ అయ్యారు. వేరే మండలాల నుంచి నాతవరం మండలానికి 38 మంది మాత్రమే వచ్చారు. గన్నవరం, నాతవరం-2 సచివాలయాల్లో ఇద్దరేసి ఉద్యోగులు మాత్రమే వుండడంతో వీటి పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. చమ్మచింత-6, చెర్లోపాలెం-5, డియర్రవరం-6, గన్నవరం-9, గొలుగొండపేట-6, గుమ్మిడిగొండ-5 గునుపూడి-8, ఎంబీపట్నం-8, ఎం.బెన్నవరం-6, మన్యపురట్ల-5, నాతవరం ఒకటి-8, నాతవరం రెండు-9, పీకేగూడెం-6, సరుగుడు-6, శృంగవరం-6, వల్సంపేట-6, వైడీపేట-6. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సచివాలయాల్లో కనీసస్థాయిలో ఉద్యోగులు ఉండేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.