ఏసీబీ వలలో సచివాలయ కార్యదర్శి, ఆర్‌ఐ
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:13 AM
జీవీఎంసీ రెండో వార్డు పరిధిలోని బొగ్గురోడ్డు గ్రామ సచివాలయ కార్యదర్శి, జి వి ఎం సి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ.30 వేలు లంచం తీసు కుంటూ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు.
- రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చేందుకు లంచం డిమాండ్
- రూ.30 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
తగరపువలస, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ రెండో వార్డు పరిధిలోని బొగ్గురోడ్డు గ్రామ సచివాలయ కార్యదర్శి, జి వి ఎం సి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ.30 వేలు లంచం తీసు కుంటూ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎ్‌స రమణమూర్తి తెలిపిన వివరాలు ప్రకారం...చిట్టివలస గ్రామానికి చెందిన యువకుడు తనకు వారసత్వంగా వచ్చిన ఇంటికి హక్కుదారుడిగా నమోదు చేయాల్సిందిగా గత నెలలో గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అతని తాత...ఇంటిని మేనత్తలకు చెందేలా వీలునామా రాశారు. వారి నుంచి ఈ యువకుడు ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ డాక్యుమెంట్లు, ఇతర వివరాలను గ్రామ కార్యదర్శి వై.స్వామినాయుడు, సచివాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ముగడ రాజుకు చూపించి రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలని కోరాడు. ఈ విషయమై గత నెల 12వ తేదీ నుంచి సచివాలయ కార్యదర్శి, ఆర్‌ఐల చుట్టూ తిరుగుతున్నాడు. అందుకు వారు రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెబితే కనీసం రూ.50 వేలు అయినా ఇవ్వాలన్నారు. చివరికి రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని యువకుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం సచివాలయంలో కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ సమయంలో ఆర్‌ఐ రాజు సచివాలయంలో లేకపోవడంతో అతన్ని వేరే ప్రాంతంలో పట్టుకుని అరెస్టు చేసి సచివాలయానికి తీసుకువచ్చారు. ఈ దాడిలో డీఎస్పీ రమణమూర్తితో పాటు ఎస్‌ఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ పాల్గొన్నారు. కాగా ఫిర్యాదుదారులు తమ పేర్లు బయటకు వెల్లడించవద్దని కోరినట్టు డీఎస్పీ తెలిపారు.