Share News

స్టీల్‌ ప్లాంటులో రెండో విడత వీఆర్‌ఎస్‌!

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:42 AM

స్టీల్‌ప్లాంట్‌ యజమాన్యం శనివారం రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించింది.

స్టీల్‌ ప్లాంటులో రెండో విడత వీఆర్‌ఎస్‌!

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంట్‌ యజమాన్యం శనివారం రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 11న తొలి విడత వీఆర్‌ఎస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్లాంటులో ఉన్న పర్మనెంట్‌ ఉద్యోగులను మరింత తగ్గించేందుకుగాను మార్గదర్శకాలను విడుదల చేసింది. అధికారులకు, కార్మికులకూ ఈ పథకం వరిస్తుంది. సంస్థలో 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని, 45 ఏళ్లు దాటినవారు ఇందుకు అర్హులుగా పేర్కొంది. గుజరాత్‌ మోడల్‌ ప్రకారం సంస్థలో ఇప్పటికే పూర్తిచేసుకున్న సర్వీసుకు ఏడాదికి 35 రోజుల వేతనం (బేసిక్‌ ప్లస్‌ డీఏ), మిగిలి ఉన్న సర్వీసుకు ఏడాదికి 25 రోజుల వేతనాన్ని చెల్లించనున్నారు. పదవీ విరమణ సమయంలో చెల్లించే పీఎఫ్‌, గ్రాట్యుటీ, ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పోస్టు మెడికల్‌, హోమ్‌ టౌన్‌ ట్రావెలింగ్‌ అలవెన్స్‌ వంటివి చెల్లిస్తారు. కాగా చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌, కంపెనీ సెక్రటరీలు, మెడికల్‌ స్పెషలిస్టు, బాయిలర్‌ ఆపరేటర్స్‌, మైనింగ్‌ ఇంజనీర్లు ఈ పథకానికి అర్హులు కారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈపీఎస్‌ఎస్‌ పోర్టల్‌లో పొందుపరిచారు. ఆసక్తి గలవారు జూలై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఉపసంహరణకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.


రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

పోర్టు రోడ్డులో స్కిడ్‌ అయిన బైక్‌

ఇరువురి పైనుంచి దూసుకువెళ్లిన వెనుకనున్న లారీ

మృతులు...నేవీ ఆస్పత్రిలో వైద్యుడు, స్టాఫ్‌నర్సు

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

పోర్టు రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో ఒకరు నేవీ ఆస్పత్రిలో వైద్యుడు కాగా, మరొకరు స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌కు వచ్చే మార్గంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన సౌమ్యా ఆస్తి (24) నేవీ ఆస్పత్రిలో వైద్యునిగా, ఢిల్లీకి చెందిన మేఘా రావత్‌ (26) అదే ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. వారిద్దరూ శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సింధియా నుంచి నగరంలోకి వచ్చేందుకు పల్సర్‌ బైక్‌పై బయలుదేరారు. పోర్టు రోడ్డులో ఎస్‌ఆర్‌ కంపెనీ దాటిన తర్వాత ముందు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌తోపాటు ఆటోను ఓవర్‌టేక్‌ చేశారు. ఆ తర్వాత అప్పటికే చిన్నపాటి వర్షానికి రోడ్డు తడిచివుండడంతో బైక్‌ స్కిడ్‌ అయి కుడివైపు పడిపోయారు. అదే సమయంలో వచ్చిన ట్యాంకర్‌ వారిద్దరి పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్టు హార్బర్‌ సీఐ సింహాద్రినాయుడు తెలిపారు.


రైళ్ల రీ షెడ్యూల్‌

గంటలకొద్దీ ఆలస్యంగా నడిచిన

బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌, హౌరా-ఎర్నాకులం

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

వివిధ జోన్ల పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం, దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను శనివారం రీషెడ్యూల్‌ చేశారు. దీంతో గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. బెంగళూరులో ఉదయం 10.35 గంటలకు బయలుదేరాల్సిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864) సాయంత్రం 5.30 గంటలకు, హౌరాలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా-ఎర్నాకులం అంతోఽ్యదయ ఎక్స్‌ప్రెస్‌ (22877) సాయంత్రం 4.30 గంటలకు, హౌరాలో మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరాల్సిన హౌరా-తిరుపతి హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20889) 2.30 గంటలకు, శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరాల్సిన శ్రీకాకుళం-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు (07026) సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరాయి. రీ షెడ్యూల్‌పై అవగాహన లేని ప్రయాణికులు కొందరు నిర్ణీత సమయం ప్రకారం స్టేషన్‌కు చేరుకుని గంటల తరబడి ప్లాట్‌ఫామ్‌లపై నిరీక్షించాల్సి వచ్చింది.

Updated Date - Jun 15 , 2025 | 12:42 AM