గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:43 AM
మండలంలోని జీనబాడు పంచాయతీ బోటురేవ్‌కు కూతవేటు దూరంలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
సాయంత్రమైనా లభ్యం కాని ఇద్దరి ఆచూకీ
నేడు కూడా కొనసాగనున్న గాలింపు
అనంతగిరి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీనబాడు పంచాయతీ బోటురేవ్‌కు కూతవేటు దూరంలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జీనబాడుకు చెందిన గాలి అప్పలరాజు, డెబర రమేశ్ గల్లంతైన విషయం తెలిసిందే. వీరి ఆచూకీ కోసం పాడేరు డీఎస్పీ షెహబాజ్ అహ్మద్, అరకు సీఐ హిమగిరి, అనంతగిరి తహశీల్దార్ వీరభద్రచారి పర్యవేక్షణలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి చెందిన సుమారు 23 మంది సోమవారం ఉదయం నుంచి రైవాడ జలాశయం వద్ద ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా గాలించారు. అయితే సాయంత్రమైనప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం కూడా గాలించనున్నారు. అనంతగిరి, డుంబ్రిగుడ ఎస్‌ఐలు డి.శ్రీనివాసరావు, పాపినాయుడు గాలింపు చర్యలను పర్యవేక్షించారు.