జిల్లాలో స్క్రబ్ టైఫస్
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:26 AM
జిల్లాలో తొలిసారి స్క్రబ్ టైఫస్ కేసులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దేవరాపల్లి, కె.కోటపాడు మండలం చౌడువాడల్లో ఇద్దరికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. ఈ వ్యాధి రికెట్టియా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని, ఈ బ్యాక్టీరియా కలిగిన మైట్ (పేడ పురుగు) లార్వా కుట్టినవారు స్క్రబ్ టైఫస్ బారిన పడతారని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి తెలిపారు.
చౌడువాడ, దేవరాపల్లిలో ఒక్కొక్కరికి వ్యాధి లక్షణాలు
తీవ్రజ్వరం, శరీరంపై దద్దుర్లు
రక్త నమూనాలు సేకరించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
నర్సీపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో తొలిసారి స్క్రబ్ టైఫస్ కేసులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దేవరాపల్లి, కె.కోటపాడు మండలం చౌడువాడల్లో ఇద్దరికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో అధికారులు రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. ఈ వ్యాధి రికెట్టియా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని, ఈ బ్యాక్టీరియా కలిగిన మైట్ (పేడ పురుగు) లార్వా కుట్టినవారు స్క్రబ్ టైఫస్ బారిన పడతారని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి తెలిపారు. వ్యవసాయ పనులు చేసేవారు ఈ పురుగు బారిన పడతారని, ఇది కుట్టినచోట నల్లటి మచ్చ వస్తుందని చెప్పారు. ఇంకా తీవ్రమైన జ్వరం, శరీరం మీద దద్దుర్లు, కండ్లకలక, దగ్గు, ఒంటినొప్పులు, ఊపిరి తీసుకోవడం కష్టంగా వుండడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వరుసగా రెండు రోజులపాటు తీవ్రమైన జ్వరం వుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. పొలం పనులు చేసేటప్పుడు శరీరం మొత్తం వస్త్రాలతో కప్పుకొని, చెప్పులు ధరించాలని సూచించారు. డాక్టర్ పర్యవేక్షణలో ఐదు నుంచి ఏడు రోజులపాటు మందులు వాడితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు.